Income from Residential Property: పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల, సాధారణంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. రెండోది, ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతుంది. లాంగ్‌టర్మ్‌లో అమ్ముకుంటే భారీ మొత్తం ఆర్జించొచ్చు.


ఇంటి ఆస్తి నుంచి ఆదాయం సంపాదిస్తుంటే, దానిపై కచ్చితంగా పన్ను కట్టాలి. అద్దె ద్వారా ఇన్‌కమ్‌ సంపాదించినా, లేదా ఆస్తిని అమ్మినా, ఈ రెండు సందర్భాల్లోనూ టాక్స్‌ లయబిలిటీ (పన్ను బాధ్యత) ఉంటుంది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ పన్ను బాధ్యత విభిన్నంగా ఉంటుంది.


ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను
ఇంటిని అమ్మడం వల్ల వచ్చే లాభాన్ని మూలధన లాభంగా (Capital Gain) లెక్కిస్తారు. ఈ మూలధన లాభంపై రెండు రకాల పన్నులు ఉంటాయి. ఆ ఇంటిని కొన్న నాటి నుంచి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత అమ్మితే, దానిని దీర్ఘకాలిక మూలధన లాభంగా (LTCG) పరిగణిస్తారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ తర్వాత మూలధన లాభంపై 20% టాక్స్‌ పే చేయాలి. కొన్న నాటి నుంచి 24 నెలల లోపు ఇంటిని విక్రయిస్తే వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభంగా (STCG) లెక్కిస్తారు. ఈ లాభం టాక్స్‌పేయర్‌ ఆదాయానికి యాడ్‌ చేయాలి, మొత్తం ఆదాయంపై వర్తించే స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి.


క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ను సేవ్‌ చేయొచ్చు
కొన్ని సందర్భాల్లో, ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్ 54 ప్రకారం, ఒక ఇంటిని విక్రయించడం వల్ల వచ్చే డబ్బుతో మరో ఇంటిని కొంటే పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రయోజనం లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ విషయంలో మాత్రమే వర్తిస్తుంది. 


"రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ కొనుగోలు/నిర్మాణానికి మాత్రమే" మూలధన లాభం ఉపయోగించాలని సెక్షన్ 54 స్పష్టంగా చెబుతోంది. కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు ఈ రూల్‌ వర్తించదు. ఓపెన్‌ ప్లాట్‌ను కొని ఇల్లు కట్టినా కూడా ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. కేవలం ఓపెన్‌ ఫ్లాట్‌ కొని వదిలేస్తే ఈ బెనిఫిట్‌ వాడుకోలేం. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి, రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ నుంచి వచ్చే క్యాపిటల్‌ గెయిన్‌లో రూ.10 కోట్ల వరకే టాక్స్‌ బెనిఫిట్‌ పొందొచ్చు. రూ.10 కోట్లు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి.


ఎంత కాలం వరకు టాక్స్‌ బెనిఫిట్‌ వర్తిస్తుంది?
సెక్షన్ 54 ప్రకారం పన్ను మినహాయింపు పొందడానికి, పాత ఆస్తిని అమ్మిన తేదీ నుంచి 2 సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. ఇంటి నిర్మాణం చేపడితే మూడేళ్ల లోపు దానిని కంప్లీట్‌ చేయాలి. ఒకవేళ, నివాస ఆస్తిని అమ్మడానికి ఒక సంవత్సరం ముందు కొత్త ఇంటిని కొనుగోలు చేసినా కూడా టాక్స్‌ బెనిఫిట్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


అద్దె ఆదాయంపై పన్ను బాధ్యత
అద్దె రూపంలో ఆదాయం వస్తుంటే ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌లో దానిని చూపించాలి. 'అదర్‌ ఇన్‌కమ్‌' హెడ్‌ కింద దీనిని రిపోర్ట్‌ చేయాలి. తద్వారా, ఇది టాక్స్‌పేయర్‌ టోటల్‌ ఇన్‌కమ్‌లో కలుస్తుంది, స్లాబ్ సిస్టమ్‌ ప్రకారం టాక్స్‌ పే చేయాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: జియో ఫైనాన్షియల్ షేర్‌ ధర ₹261.85, మార్కెట్‌ అంచనాలు బలాదూర్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial