Income Tax Return: 2022-23 ఆర్థిక సంవత్సరం/2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ (ITR Filing) చేయడానికి చివరి తేదీ అతి సమీపంలో ఉంది. ఆదాయపు పన్ను విభాగం, సకాలంలో ఐటీఆర్‌లు ఫైల్‌ చేయమంటూ టాక్స్‌ పేయర్లకు పదే పదే సూచిస్తోంది. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్న పన్ను చెల్లింపుదార్లలో దాదాపు 70 శాతం మంది ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించడం లేదు.


70 శాతం మందిపై జీరో టాక్స్‌ లయబిలిటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో ఫైల్‌ చేసిన మొత్తం ఐటీఆర్‌ల్లో, 70 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం రాలేదు. వాళ్ల పన్ను బాధ్యత (tax liability) సున్నా. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మల సీతారామన్‌ ఈ సమాచారాన్ని పార్లమెంటుకు వెల్లడించారు. గవర్నమెంట్‌ లెక్క ప్రకారం, FY23లో మొత్తం 7.40 కోట్ల మంది ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశారు. వాళ్లలో 5.16 కోట్ల మంది/70 శాతం మందిది 'జీరో' టాక్స్‌ లయబిలిటీ. కాబట్టి, ఆ 5.16 కోట్ల మంది ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు. తాము ఆదాయ పన్ను పరిధిలో లేమని వాళ్లు ప్రకటించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం FY22లో మొత్తం 6.9 కోట్ల మంది ITR దాఖలు చేశారు. వీరిలో 5.05 కోట్ల మంది/73 శాతం మంది పన్ను బాధ్యత 'సున్నా'.      


పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్‌      
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అవగాహన కార్యక్రమాల వల్ల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పార్లమెంటుకు వెల్లడించారు. FY23లో, ఐటీఆర్‌లు ఫైల్‌ చేసిన వాళ్ల సంఖ్య 6.18 శాతం పెరిగింది. గత నాలుగేళ్లలో రిటర్న్ దాఖలు చేసిన వాళ్ల సంఖ్య 14.37 శాతం పెరిగింది. అయితే, అదే కాలంలో జీరో టాక్స్‌ లయబిలిటీతో రిటర్న్‌ దాఖలు చేసిన వాళ్ల నంబర్‌ కూడా 77.93 శాతం పెరిగింది.


ఇప్పటివరకు 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు      
AY24లో, ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు ఫైల్‌ చేశారు. వీళ్లలో, అర్హులైన 80 లక్షల మందికి పైగా రిఫండ్స్‌ జారీ అయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, డివిడ్యువల్‌, కార్పొరేట్‌ డైరెక్ట్‌ టాక్స్‌లు రూ. 16.61 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా చెప్పారు. 2021-22తో పోలిస్తే ఈ మొత్తం 17.67 ఎక్కువ. సాధ్యమైనంత త్వరగా ఐటీ రిటర్నులు ప్రాసెస్‌ చేసి, రిఫండ్‌ అందిస్తున్నామని నితిన్‌ గుప్తా చెప్పారు. ఐటీఆర్‌ ఈ-వెరిఫై చేసిన నాటి నుంచి గరిష్టంగా 16 రోజుల్లో ప్రాసెస్‌ పూర్తి చేస్తున్నామని, దాదాపు 42% ఐటీఆర్‌లు ఒక రోజులోనే ప్రాసెస్‌ చేసినట్లు చెప్పారు.            


మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌లోనూ 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌' తీసుకోవచ్చు, బెనిఫిట్స్‌ కూడా ఎక్కువే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial