Sweep Account: దేశంలో కోట్లాది మందికి నార్మల్‌ సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. వ్యాపారస్తులు కరెంట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేస్తారు. అయితే, సేవింగ్స్‌ ఖాతా, కరెంట్‌ అకౌంట్‌ మీద పెద్దగా వడ్డీ రాదు. అదే డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) చేస్తే, మంచి వడ్డీ ఆదాయం వస్తుంది. పొదుపు, కరెంట్ అకౌంట్‌, FD మధ్య గ్యాప్‌ తగ్గించడానికి ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది.


మొదట, పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా, FD గురించి కొన్ని ప్రాథమిక విషయాలు గుర్తు చేసుకుందాం. పొదుపు, కరెంట్ ఖాతాల్లో అతి పెద్ద ప్రయోజనం.. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అకౌంట్‌లోని డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్‌ FD అకౌంట్‌లో లేదు. మీ డబ్బును ఒకసారి అందులో పార్క్ చేస్తే, నిర్దిష్ట సమయం వరకు వెనక్కు తీసుకోవడం కుదర్దు. రిటర్న్స్‌ పరంగా చూస్తే.. సేవింగ్స్‌, కరెంట్ ఖాతా కంటే FD బరువు ఎక్కువ. 


స్వీప్ ఇన్ ఫీచర్ ఈ రెండు ఇబ్బందులను తగ్గిస్తుంది. మీ అవసరానికి అనుగుణంగా డబ్బును డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేసుకునే ఫెసిలిటీని మీకు అందిస్తుంది. FD తరహా వడ్డీని కూడా పొందొచ్చు. 


స్వీప్‌ ఆప్షన్‌తో ఎవరికి ఉపయోగం?
ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి. వ్యాపారం లేదా ఏదైనా ఇతర సంపాదన మార్గాలు కూడా ఉన్నాయి. మీ జీతంతో మీ రోజువారీ ఖర్చులు గడుస్తున్నాయి. ఇతర ఇన్‌కమ్‌ సోర్సెస్‌ నుంచి వచ్చే డబ్బు మీకు అదనంగా ఉంటుంది. అయితే, ఈ మార్గాల నుంచి స్థిరమైన మొత్తం రాకపోవచ్చు. ఒక్కోసారి 10 వేలు, మరోసారి 15 వేలు, ఇంకోసారి 25 వేలు.. ఇలా రావచ్చు. అంతేకాదు, డబ్బు రావడానికి కూడా ఒక కచ్చితమైన తేదీ ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితిలో, అదర్‌ సోర్సెస్‌ నుంచి వచ్చే అదనపు డబ్బును మీరు పొదుపు లేదా కరెంట్ ఖాతాలో ఉంచితే, మీ బ్యాంకు మీకు నామమాత్రపు వడ్డీని చెల్లిస్తుంది. దీనిపై మంచి వడ్డీ రాబట్టుకోవడానికి స్వీప్‌ ఇన్‌ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు.


స్వీప్ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది?
స్వీప్ ఇన్ ఫీచర్, మీ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలోని ఎక్సెస్ మనీని FD లాగా మారుస్తుంది. ఉదాహరణకు... మీ నెలవారీ ఖర్చు రూ. 50 వేలు అనుకుందాం. మీరు స్వీప్ ఇన్ ఫీచర్ కింద మీ సేవింగ్స్‌ లేదా కరెంట్‌ ఖాతాలో 50 వేల రూపాయల పరిమితిని పెట్టారు. ఇప్పుడు మీ అకౌంట్‌ 50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బు మిగిలి ఉంటే, అది FD అవుతుంది. మీ ఎక్సెస్‌ ఫండ్‌పై అధిక వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఇది సాధారణ FDతో సమానంగా ఉంటుంది.


FDలాగా ఇందులోనూ డబ్బు చిక్కుకుపోతుందా?
స్వీప్ ఇన్ ఫీచర్ ఈ సమస్యను కూడా తొలగిస్తుంది. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, మీరు ఈ FD నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు, తర్వాత దాన్ని తిరిగి ఫిల్‌ చేయవచ్చు. నిర్ణీత గడువులోగా ఆ డబ్బును తిరిగి డిపాజిట్ చేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి ఫైన్‌ పడదు, ఎఫ్‌డీ ప్రయోజనం తగ్గదు.


మీరు మీ బ్యాంక్‌తో మాట్లాడటం ద్వారా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అన్ని ప్రధాన బ్యాంకులు తమ కస్టమర్లకు స్వీప్‌ ఇన్‌ ఫెసిలిటీ అందిస్తున్నాయి. మీ సౌలభ్యాన్ని బట్టి స్వీప్ పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఇది పూర్తయితే, సాధారణ సేవింగ్స్‌ అకౌంట్‌ నుంచే FD మజాను ఆస్వాదించవచ్చు.


మరో ఆసక్తికర కథనం: పోస్టాఫీస్‌లోనూ 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌' తీసుకోవచ్చు, బెనిఫిట్స్‌ కూడా ఎక్కువే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial