Income Tax Exemption: మన దేశంలో, డబ్బు సంపాదిస్తూ, ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి, సంస్థ నుంచి ఆదాయ పన్ను వసూలు చేస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఒక విద్యాసంస్థకు మాత్రం ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపును ప్రసాదించింది. ఆ సంస్థ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE). దీనికి సంబంధించి 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్' (CBDT) తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
5 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపు
సీబీఎస్‌ఈ, ఏకంగా ఐదేళ్ల పాటు ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి విముక్తి పొందింది. పరీక్ష రుసుములు, పాఠ్యపుస్తకాల విక్రయం, ప్రచురణ, ఇతర రచనల ద్వారా CBSE ఆదాయం సంపాదిస్తోంది. ఈ ఆదాయాలపై ఐదు ఆర్థిక సంవత్సరాల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా సీబీఎస్‌ఈకి ఆర్థిక మంత్రిత్వ శాఖ మినహాయింపును ఇచ్చింది. CBSEకి ఈ మినహాయింపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్ 1, 2020 నుంచి ప్రారంభమైంది, ఆర్థిక సంవత్సరం చివరి తేదీ మార్చి 31, 2021 వరకు అమలైంది. 2021-22, 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది. అంటే, గత మూడు ఆర్థిక సంవత్సరాల కాలానికి పన్ను మినహాయింపుతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కేంద్ర విద్యాసంస్థ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపు కాలంలో పన్ను చెల్లించి ఉంటే, ఆ మొత్తాన్ని వడ్డీతో కలిపి రిఫండ్ చేస్తారు.
ఎలాంటి సంపాదనపై పన్ను ఉండదు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(46) కింద, దిల్లీకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను ప్రభుత్వం నోటిఫై చేసిందని, ఆ సంస్థకు వచ్చే అంచనా ఆదాయంపై ఆదాయ పన్ను చెల్లింపును మినహాయించిందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఆదాయ పన్ను నుంచి మినహాయించిన CBSE ఆదాయంలో.. పరీక్ష ఫీజులు, CBSEకి సంబంధించిన ఫీజులు, పాఠ్య పుస్తకాలు & ప్రచురణల విక్రయం, రిజిస్ట్రేషన్ ఫీజులు, క్రీడ రుసుములు, శిక్షణ రుసుములు మొదలైనవి ఉంటాయని పేర్కొంది.
ఇవే కాకుండా, CBSE ప్రాజెక్ట్‌లు/ప్రోగ్రామ్‌ల నుంచి పొందిన మొత్తం, ఈ తరహా ఆదాయంపై వచ్చే వడ్డీ, ఆదాయపు పన్ను వాపసుపై వచ్చే వడ్డీని కూడా ఆదాయపు పన్ను నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. CBDT వెల్లడించిన ప్రకారం... CBSE ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకూడదు, పన్ను మినహాయింపు పొందిన కాల వ్యవధిలో తన సంపాదన పద్ధతులను మార్చకూడదు అనే షరతుకు లోబడి CBSEకి పన్ను మినహాయింపును వర్తింపుజేశారు.
CBSEకి పన్ను మినహాయింపు గడువు జూన్ 1, 2020 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు ఉంది. ఈ నేపథ్యంలో, CBSE మునుపటి సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లను సవరించడానికి, అంచనా వేసిన ఆదాయంపై చెల్లించిన పన్ను వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ప్రత్యేక అనుమతి కోసం CBDTకి దరఖాస్తు చేసుకోవచ్చు.