ITR Filing For FY 2023-24: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 (AY 2024-25) కోసం... ఆలస్యమైన ఆదాయ పన్ను పత్రాలు (Belated  Income Tax Returns) లేదా సవరించిన ఆదాయ పన్ను పత్రాలను (Revised Income Tax Returns) సమర్పించడానికి తుది గడువును పొడిగించింది. ప్రస్తుతం, డిసెంబర్ 31, 2024 వరకు ఉన్న గడువును జనవరి 15, 2025కు మార్చింది. 


ఏ కారణం వల్లనైనా, సాధారణ గడువు 2024 జులై 31లోగా ITR ఫైల్ చేయలేకపోయిన వ్యక్తులు బీలేటెడ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ను డిసెంబర్ 31, 2024లోగా సమర్పించాలి. ఇప్పటికే ఐటీఆర్‌ సమర్పించి, దానిలో ఏవైనా మార్పులతో మరొకసారి ఫైల్‌ చేసే వ్యక్తులు రివైజ్డ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ను కూడా  డిసెంబర్ 31, 2024లోగా ఫైల్‌ చేయాలి. ఈ గడువును CBDT పెంచడంతో, ఇప్పుడు, ఈ రెండు వర్గాలకు చెందిన టాక్స్‌పేయర్లు రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి అదనంగా రెండు వారాలు సమయం దొరికింది.






బీలేటెడ్‌ ఐటీఆర్ ఫైలింగ్
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY 2023-24) ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే సాధారణ గడువు జులై 31ని మిస్‌ చేశారు కాబట్టి, ఇప్పుడు ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే ఆలస్య రుసుము చెల్లించాలి. రిటర్న్ మొత్తం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే పన్ను చెల్లింపుదారు రూ. 1,000 & రిటర్న్ విలువ రూ. 5 లక్షలు దాటితే రూ. 5,000 లేట్‌ ఫీజ్‌గా చెల్లించాలి. దీంతోపాటు, రిటర్న్‌ ప్రకారం వర్తించే ఆదాయ పన్నుకు కూడా చెల్లించాలి. CBDT తాజా ప్రకటన ప్రకారం, వీళ్లకు కొత్త గడువు జనవరి 15, 2025.


రివైజ్డ్‌ ఐటీఆర్ ఫైలింగ్
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు తప్పులు చేయవచ్చు లేదా కీలక సమాచారాన్ని యాడ్‌ చేయడం మరిచిపోవచ్చు. తప్పులను దిద్దుకుని లేదా సమాచారాన్ని యాడ్‌ చేసి రివైజ్డ్‌ ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి ఆదాయ పన్ను విభాగం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. ఇలా, ఒకే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరణలతో రెండోసారి ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే వాళ్లకు కూడా ఇప్పుడు అదనంగా రెండు వారాల సమయం దొరికింది.



దేశ జనాభాలో కేవలం 6.68 శాతం మంది మాత్రమే
2023-24 ఆర్థిక సంవత్సరంలో, భారత జనాభాలో కేవలం 6.68 శాతం మంది మాత్రమే ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేశారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి డిసెంబర్ 17న పార్లమెంటుకు తెలిపారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... మొత్తం 145 కోట్ల భారతదేశ జనాభాలో, FY 2023-24లో, ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌లను పూరించిన వ్యక్తుల సంఖ్య కేవలం 8,09,03,315. వీళ్లలోనూ.. దాదాపు 4.90 కోట్ల మంది ఒక్క రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించలేదు. ఈ లెక్కన, మన దేశంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ చెల్లించిన వాళ్లు 3.19 కోట్ల మంది మాత్రమే. ఈ విషయాన్ని కూడా పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా వెల్లడించారు.


మరో ఆసక్తికర కథనం:  నగలు కొనేవాళ్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌, భారీగా తగ్గిన బంగారం రేటు - ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవి