Income Tax Return Filing 2024: ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్ కోసం కొత్త ఆదాయ పన్ను పద్ధతి (New Tax Regime) బెటరా, పాత ఆదాయ పన్ను (Old Tax Regime) పద్ధతి బెటరా అన్నది చాలా మంది టాక్స్‌పేయర్స్‌లో (Taxpayers) ఉన్న సందేహం. ప్రస్తుతం, ఈ రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త పన్ను పద్ధతి డీఫాల్ట్‌గా కనిపిస్తుంటుంది, దీనిని మార్చుకోవచ్చు.


ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కొత్త పన్ను విధానంలో, 'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి'ని (Income Tax Rebate) రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచిన భారత ప్రభుత్వం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా అదే పరిమితిని కొనసాగించింది. ఉద్యోగులకు మరో రూ. 50 వేలు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) రూపంలో యాడ్‌ అవుతుంది. అంటే, రూ. 7.5 లక్షల వరకు ఆదాయం సంపాదించేవాళ్లు ఒక్క రూపాయి కూడా టాక్స్‌ కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే, పన్ను తగ్గింపు/మినహాయింపు సెక్షన్లు కొత్త పన్ను పద్దతికి వర్తించవు. 


పాత పన్ను విధానంలోనూ టాక్స్‌ రిబేట్‌ పరిమితి రూ.5 లక్షలుగా యథాతథంగా కొనసాగుతోంది. ఈ పద్ధతిలో, వివిధ సెక్షన్ల కింద టాక్స్‌ డిడక్షన్స్‌, ఎగ్జంప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి.


ఇలా ఉంటే కొత్త పద్ధతి బెటర్‌
2023-24 ఆర్థిక సంవత్సరానికి మీ మొత్తం ఆదాయం ఎంత, క్లెయిమ్‌ చేసుకోదగిన వ్యయం ఎంతో సరిగ్గా గుర్తిస్తే.. ఏ పన్ను విధానం ఎంచుకోవాలో సులభంగా నిర్ణయించుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50 వేలతో కలిపి మొత్తం రూ.7.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం మీకు ఉన్నా, 31,200 రూపాయలు టాక్స్‌ కట్టాల్సి వస్తుంది. 


పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితి రూ.5 లక్షలు. కాబట్టి, మీరు పన్ను పరిధిలోకి రాకూడదనుకుంటే రూ.2.5 లక్షల వరకు (7,50,000-5,00,000) మినహాయింపులను చూపించాల్సి ఉంటుంది. ఈ విధానంలో, సెక్షన్‌ 80C కింద గరిష్టంగా 1.5 లక్షల వరకు చూపించుకోవచ్చు. మరో లక్ష రూపాయల మినహాయింపుల కోసం ఇతర సెక్షన్లను వెతుక్కోవాలి. లేదా, ఆయా సెక్షన్ల కిందకు వచ్చే పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందు నుంచే పెట్టి ఉండాలి. ఇది కాస్త కష్టమైన పనే కాబట్టి, మీ ఆదాయం రూ.7.5 లక్షల లోపు ఉంటే కొత్త పన్ను విధానం ఎంచుకోవడం ఉత్తమ మార్గంగా ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు. దీంతోపాటు... మీ ఆదాయం ఎక్కువగా ఉండి, ఇంటి రుణం లేకపోతే.. కొత్త పన్ను విధానం ఎంచుకోవడం బెటర్‌ ఆప్షన్‌గా చెబుతున్నారు.


ఇలా ఉంటే పాత పద్ధతి బెటర్‌
ఒకవేళ.. పన్ను తగ్గించే వ్యయాలు, పెట్టుబడులపై మీకు ముందు నుంచే అవగాహన ఉండి, అలాంటి వ్యయాలు, పెట్టుబడులు మీ ఆదాయంలో 30 శాతం వరకు ఉంటే.. మీరు పాత పన్ను పద్ధతిని ఫాలో కావచ్చు. ముఖ్యంగా, మీకు గృహ రుణం ఉంటే.. అదే పెద్ద ఎగ్జంప్షన్‌ క్రియేట్‌ చేస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు రూ.14 లక్షలకు మించని ఆదాయం ఉండి, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడులు దానిలో 30 శాతం తగ్గకుండా ఉంటే.. మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు, తద్వారా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ITR ఫైల్‌ చేయవచ్చు. లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.14 లక్షలకు మించకుండా, పన్ను తగ్గించుకునే వ్యయాలు, పెట్టుబడుల మొత్తం కూడా రూ.4.25 లక్షలకు మించకుండా ఉంటే... ఇలాంటి సందర్భంలో కూడా మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో కావచ్చు. 


మరో ఆసక్తికర కథనం: మార్కెట్లకు కీలక లెవెల్స్‌లో ఎదురుగాలి, కోలుకున్న పేటీఎం