NSE Nifty: 


అమెరికా ఆర్థిక మాంద్యంలో పడకుంటే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని బ్యాంక్ ఆఫ్‌ అమెరికా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్‌ కల్లా నిఫ్టీ 20500 మార్క్‌ను చేరుకుంటుందని పేర్కొంటున్నారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు స్వదేశీ ఇన్వెస్టర్లూ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడించారు. ఈ ఏడాదిలో అమెరికాలో మాంద్యం రాదని జేపీ మోర్గాన్‌ వెల్లడించడంతో మార్కెట్లో మూమెంటమ్‌ ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.


యూఎస్ ఫెడ్‌ ఇప్పటికే భారీ స్థాయిలో వడ్డీరేట్లు పెంచింది. దాంతో ఆర్థిక వృద్ధి మందగమనంలోకి జారుకుంది. ఇకపై ఫెడ్డీరేట్ల పెంపును నిలిపివేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో 2023 ఏడాదికి ముగింపునకు మూడు నెలల ముందు నుంచే సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


'స్థానిక పెట్టుబడుల వరద కొనసాగుతోంది. నిఫ్టీ మార్కెట్‌ విలువలో మూడో వంతు ఇప్పటికీ సుదీర్ఘ సగటు విలువలకు లోపే ఉంది. అందులో కొన్ని కంపెనీలు కొనుగోళ్లకు అవకాశం ఇస్తున్నాయి' అని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా ఆర్థిక వేత్త అమిశ్‌ షా అన్నారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల వాల్యుయేషన్లు విపరీతంగా పెరగడంతో లార్జ్‌ క్యాప్‌ షేర్లను కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. నిఫ్టీకి రీరేటింగ్‌ వచ్చే అవకాశం ఉందన్నారు.


'ప్రస్తుతం నిఫ్టీ లాంగ్‌ టర్మ్‌ యావరేజీ పీఈకి 16 రెట్లుగా ఉంది. కాలం గడిచే కొద్దీ నిఫ్టీలోకి వృద్ధిలో పయనిస్తున్న కంపెనీలు వచ్చి చేరుతున్నాయి. మున్ముందూ ఇలాగే జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే వాల్యుయేషన్లు చూడటం సరైన పని అవుతుంది. ఇప్పుడున్న కంపెనీల ఆధారంగా చూస్తే 19 రెట్లు ఉంది. ఆర్థిక మాంద్యం ఉండదు కాబట్టి విదేశీ సంస్థాగత మదుపర్ల రాక పెరుగుతుంది' అని అమిశ్‌ అన్నారు.


'ఆదాయం తగ్గే రంగాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. మార్జిన్‌ విస్తరణ ఆధారం వృద్ధి, ఎర్నింగ్స్‌తో పోలిస్తే వాల్యుయేషన్ల విస్తరణ వల్ల పెరిగిన షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐటీ, ఆటో, ఆటో, మెటల్స్‌, సిమెంట్‌, టెలికామ్‌, యుటిలిటీస్‌, మేటిరియల్స్‌పై ఆధారపడే కంపెనీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని' అని అమిశ్‌ పేర్కొన్నారు.


తక్కువ వాల్యుయేషన్లు, ఆదాయాలు తక్కువ తగ్గే ఫైనాన్షియల్స్‌, విస్తరణ చేపట్టే ఇండస్ట్రీస్‌, ఎంపిక చేసుకున్న ప్యాసెంజర్‌, కమర్షియల్‌ వెహికల్స్‌ కంపెనీలు, హెల్త్‌కేర్‌ రంగాల షేర్లను ఎంచుకుంటే మంచిదని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా చెబుతోంది. 'అమెరికా ఆర్థిక మాంద్యం ఎదుర్కోదని మా ఎకానమిస్టులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు నష్టం చేసే చర్యలతోనే మార్కెట్లకు నష్టం. ఎన్నికలు సైతం నష్టభయానికి గురిచేస్తాయి' అని తెలిపింది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, పేటీఎం, ఎల్‌టీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, బ్రిటానియా, సన్ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, మారుతీ సుజుకీ, టాటా  మోటార్స్‌, జొమాటో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా టాప్‌ పిక్స్‌గా ఎంపిక చేసుకుంది.


Also Read: మూడీస్‌ షాక్‌! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్‌ - పైగా వార్నింగులు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.