ITR Refund Status: అసెస్‌మెంట్ ఇయర్‌ 2023-24/ ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022-23 కోసం ఫైన్‌ లేకుండా ITR ఫైల్‌ చేసే గడువు 2023 జులై 31తో ముగిసింది. లాస్ట్‌ డేట్‌ ముగిసే సమయానికి, దేశవ్యాప్తంగా 6.7 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదార్లు రిటర్న్‌లు సబ్మిట్‌ చేశారు. ఆదాయ పన్ను పత్రాలు సమర్పించిన తర్వాత, వారిలో ఎలిజిబుల్‌ పర్సన్స్‌/కంపెనీలు/ట్రస్టులకు రిఫండ్‌ వస్తుంది. అయితే, చాలా మంది ఇప్పటికీ రిఫండ్‌ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో TDS లేదా అడ్వాన్స్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం, టాక్స్‌ లయబిలిటీ కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వారందరికీ రిఫండ్ లభిస్తుంది.


రిఫండ్‌ రావడానికి ఎంత టైమ్‌ పడుతుంది అన్నది టాక్స్‌ పేయర్లలో ఉదయించే ప్రశ్న. సాధారణంగా, ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసిన 7 రోజుల నుంచి 120 రోజుల లోపు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సదరు టాక్స్‌పేయర్‌కు రిఫండ్‌ చెల్లిస్తుంది. రిఫండ్‌ మొత్తం అతను/కంపెనీ/ట్రస్ట్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. ఈ ఏడాది రిఫండ్‌ టైమ్‌ బాగా తగ్గింది, చాలా మందికి సగటున 15 రోజుల్లోనే డబ్బు తిరిగొచ్చింది. మీరు రిటర్న్ ఫైల్‌ చేసి ఎక్కువ రోజులు అయినా ఇంకా రిఫండ్ రాకపోతే, ఫైలింగ్‌ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో ఒకసారి క్రాస్‌ చెక్‌ చేసుకోవడం బెటర్‌. ముఖ్యంగా, రిటర్న్‌ ఫైల్‌ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోపు దానిని ఈ-వెరిఫై చేయకపోతే, ఐటీ రిటర్న్‌ సబ్మిట్‌ చేసినట్లుగా డిపార్ట్‌మెంట్‌ పరిగణించదు. అప్పుడు, ఆ ITR ప్రాసెస్ ప్రారంభం కాదు, రిఫండ్‌ రాదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌ ప్రకారం, ఐటీఆర్‌ను ధృవీకరించిన వారికి మాత్రమే పన్ను వాపసు జారీ అవుతుంది. మీరు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ITR ఫైల్ చేసినట్లయితే, రిఫండ్‌ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్‌ చేయవచ్చు.


IT రిఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్‌ చేయాలి?


ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిండి. నకిలీ సైట్లు కూడా ఇంటర్నెట్‌లో ఉన్నాయి, జాగ్రత్త.
మీ లాగిన్ యూజర్ ID (PAN నంబర్), పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి
ఆ తర్వాత, మీరు View Returns లేదా ఫామ్ ఆప్షన్‌ ఎంచుకోవాలి
డ్రాప్ డౌన్ బాక్స్‌లో ఆదాయ పన్ను రిటర్న్స్ ఆప్షన్‌ ఎంచుకోండి
ఆ తర్వాత, అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయండి
ఇప్పుడు, మీ ITR రిసిప్ట్స్‌ నంబర్‌ నమోదు చేయండి
కొన్ని నిమిషాల్లోనే మీ ITR రీఫండ్ స్టేటస్‌ మీకు కనిపిస్తుంది


NSDL వెబ్‌సైట్‌లో ఎలా తనిఖీ చేయాలి?


మీరు tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ని సందర్శించండి.
మీ పాన్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్‌, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి
మీ IT రిఫండ్‌ ప్రస్తుత స్థితి వెంటనే మీ కళ్ల ముందు కనిపిస్తుంది


ఏప్రిల్‌-జూన్‌ కాలంలో 1.36 కోట్ల ITRలు
ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య కాలంలో 1.36 కోట్ల మంది ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు ఫైల్‌ చేశారు. గత ఏడాది 2022 ఇదే కాలంలో దాఖలైన 70.34 లక్షల రిటర్నులతో పోలిస్తే, ఈసారి ఫైలింగ్స్‌ 93.76% పెరిగాయి. ఈ ఏడాది జులై నెలలోనే 5.41 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. మొత్తంగా చూస్తే.. గత నెలాఖరు (జులై 31) నాటికి 6.77 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటించింది. 


మరో ఆసక్తికర కథనం: పెన్నీ స్టాక్స్‌ అంటే ఫన్నీ అనుకుంటివా? పవర్‌ఫుల్‌ స్టాక్స్‌ - డబ్బుల వర్షం కురిపించాయి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial