Gratuity Calculation Formula: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Modi 3.0 Government) ఇటీవలే 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటును ప్రకటించింది, ఇది 2026 నుంచి వర్తిస్తుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను & పింఛనుదార్ల పెన్షన్‌ను సవరించడం ఈ కమిషన్ లక్ష్యం. దీనితో పాటు, నూతన పెన్షన్ స్కీమ్ 'ఏకీకృత పెన్షన్ పథకం' (Unified Pension Scheme - UPS) కూడా 01 ఏప్రిల్ 2025 నుంచి అమలులోకి రాబోతోంది. ఇవన్నీ, ఉద్యోగి అందుకునే గ్రాట్యుటీపై కూడా ప్రభావం చూపుతాయి.
గ్రాట్యుటీ అనేది, ఒక ఉద్యోగి చేసిన సేవలను గుర్తించి & అతనికి కృతజ్ఞతపూర్వకంగా కంపెనీ అందించే అదనపు డబ్బు. ఇది ఒక రకమైన రివార్డ్ లాంటిది, ఒక ఉద్యోగి ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పని చేసినప్పుడు అతనికి లభిస్తుంది. భారతీయ కార్మిక చట్టం (Indian Labor Law) ప్రకారం, ఒక ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హుడు (Eligibility for gratuity) కావడానికి కనీసం 5 సంవత్సరాలు కంపెనీలో పని చేయాలి.
4 సంవత్సరాల 7 నెలలు పని చేస్తే..
ఒక ఉద్యోగి ఒక కంపెనీలో 4 సంవత్సరాల 7 నెలలు పని చేసిన తర్వాత ఉద్యోగం మానేసి వెళ్లిపోతే అతనికి గ్రాట్యుటీ లభిస్తుందా?, 5 సంవత్సరాలు పూర్తి చేయడానికి కొన్ని నెలల సమయమే తక్కువ కాబట్టి, అతను పని చేసిన కాలాన్ని ఐదేళ్లుగా పరిగణించి గ్యాట్యుటీ ఇస్తారా?. దీనికి సమాధానం - "ఇవ్వరు". అయితే, మారిన నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి 4 సంవత్సరాల 8 నెలలు పాటు ఒక కంపెనీలో పని చేసినట్లయితే, అతను పూర్తిగా 5 సంవత్సరాలు పని చేసినట్లు పరిగణించి గ్రాట్యుటీ చెల్లిస్తారు. కానీ ఒక ఉద్యోగి 4 సంవత్సరాలు 7 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం పని చేస్తే అతనికి గ్రాట్యుటీ లభించదు & అతని సేవల కాలాన్ని 4 సంవత్సరాలుగా మాత్రమే పరిగణిస్తారు.
గ్రాట్యుటీని ఎలా నిర్ణయిస్తారు? (How is gratuity determined?)
గ్రాట్యుటీ అనేది ఒక్కసారి మాత్రమే చెల్లించే డబ్బు. జీతం లేదా బోనస్ తరహాలో పునరావృతం కాదు. ఒక ఉద్యోగి తన ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నప్పుడు లేదా ఐదేళ్ల కాలం పని చేసి ఉద్యోగం మానేసినప్పుడు గ్యాట్యుటీ చెల్లిస్తారు. గ్రాట్యుటీ మొత్తం, సాధారణంగా, ఉద్యోగి ప్రాథమిక జీతం & పని చేసిన కాలం ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిని ఉద్యోగి పదవీ విరమణ లేదా రాజీనామా సమయంలో (ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తే) ఇస్తారు. ఉద్యోగిని అకస్మాత్తుగా పని నుంచి తొలగించినప్పటికీ అతను గ్రాట్యుటీకి అర్హుడు.
గ్రాట్యుటీని లెక్కించే సూత్రం (Gratuity calculation formula)
గ్రాట్యుటీ = (చివరి జీతం x 15/26) x పూర్తి చేసిన సర్వీస్ సంవత్సరాల సంఖ్య.
ఈ ఫార్ములా ఆధారంగా ప్రతి ఉద్యోగికి లభించే గ్రాట్యుటీని లెక్కిస్తారు.
మరో ఆసక్తికర కథనం: వరుసగా రెండోరోజూ తగ్గిన నగల రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ