Things To Remember While Purchasing Health Insurance: కరోనా మహమ్మారి తర్వాత, దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమా పాలసీలకు డిమాండ్‌ పెరిగింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులను సామాన్య ప్రజలే కాదు, ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కుటుంబాలు కూడా భరించలేకపోతున్నాయి. ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ అధిక వైద్య ఖర్చుల భారం నుంచి భద్రత కల్పిస్తుంది, కుటుంబ ఆర్థిక స్థితికి రక్షణ కవచంలా పని చేస్తుంది. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కాస్ట్ కవరేజ్, బీమా మొత్తం, నెట్‌వర్క్ ఆసుపత్రులు, క్లెయిమ్ చేసే విధానం, ప్రీమియం, మినహాయింపులు & వెయిటింగ్ పీరియడ్‌ను చెక్‌ చేయాలి. మీ వ్యక్తిగత లేదా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సరైన పాలసీని ఎంచుకోవాలి. మీరు ఈ విషయాలపై శ్రద్ధ పెట్టకపోతే, సరైన చికిత్స పొందలేరు లేదా సరైన సమయంలో సరైన క్లెయిమ్ పొందలేరు. 

ఆరోగ్య బీమా పాలసీలో ఏయే ఖర్చులు కవర్ అవుతాయి?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, పాలసీలో ఏయే ఖర్చులు కవర్ అవుతాయో ముందుగా తెలుసుకోండి. ఆసుపత్రి ఖర్చులు, వైద్యుల ఫీజులు, మందుల వ్యయం, ఆపరేషన్ ఖర్చులు, కీమోథెరపీ, డయాలసిస్ & ఇంకా ఇతర ఖర్చులు వంటి వాటి గురించి మీకు పాలసీ అమ్మే కంపెనీ రిప్రజెంటేటివ్‌ లేదా ఏజెంట్‌ను అడగాలి. మీరు కొనబోయే పాలసీ సాధ్యమైనంత వరకు ఈ ఖర్చులు అన్నింటినీ కవర్ చేసేలా చూసుకోండి.

హామీ మొత్తం & బోనస్

ఆరోగ్య బీమా మొత్తాన్ని ఎంచుకునే సమయంలో, పాలసీకి బోనస్ సౌకర్యం ఉందో లేదో & ప్రీమియం మొత్తం ఎప్పుడు పెరుగుతుందో తెలుసుకోండి. మీ కుటుంబం కోసం ఆరోగ్య బీమా తీసుకుంటే ఈ విషయం మరింత కీలకం. దీనివల్ల మీ కుటుంబంలోని అందరు సభ్యులకు కవరేజ్‌ లభిస్తుంది.

ఆసుపత్రి గది & ఆరోగ్య పరీక్షల ఖర్చులు

కొన్ని పాలసీలు ఆసుపత్రి గది & ఆరోగ్య పరీక్షల ఖర్చులను కూడా కవర్ చేస్తాయి. మీ పాలసీ.. ఎన్ని రోజుల వరకు ఆసుపత్రి గది (Hospital room)లో ఉండొచ్చు & వైద్య పరీక్ష ఖర్చులు వంటి ఇతర ఖర్చులు కూడా కవర్ చేస్తాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

ఆసుపత్రుల నెట్‌వర్క్

మీరు ఎంచుకున్న ఆరోగ్య బీమా పాలసీ నెట్‌వర్క్‌కు (Hospital network) ఏయే హాస్పిటల్స్ కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులు ఆ నెట్‌వర్క్‌లో ఉన్నాయో, లేదో చూసుకోండి. బీమా కంపెనీలతో ఒప్పందం ఉన్న ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స ‍‌(Cashless treatment) సౌకర్యం అందుబాటులో ఉంది & బీమా కంపెనీయే నేరుగా బిల్లులు చెల్లిస్తుంది. 

క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజ్‌ ఉంటుందా, ఉండదా?

చాలా పాలసీలు క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలను (Critical illnesses) కవర్ చేయవు. కాబట్టి, మీ పాలసీ ఈ క్లిష్టమైన అనారోగ్యాలను కవర్ చేసేలా చూసుకోండి. 

ఆరోగ్య బీమా పాలసీని తీసుకునే సమయంలో ఇన్ని రకాల విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే, చికిత్స తర్వాత మీరు క్లెయిమ్‌ చేయడంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు చిన్న పొరపాటు చేసినా, బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు లేదా తక్కువ మొత్తం మంజూరు చేసి చేతులు దులుపుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మిగిలిన డబ్బు మీరే చెల్లించాల్సి రావచ్చు.

మరో ఆసక్తికర కథనం: పొలాల్లో బంగారం పండేలా కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు! - వ్యవసాయ బడ్జెట్‌ అంచనాలివి