Gold Jewellery Storage Limit At Home: భారతీయులకు బంగారం అంటే మహా మక్కువ. పసిడి అంటే అలంకరణ లోహం మాత్రమే కాదు, అది మన సంప్రదాయాల్లో భాగం. ఆర్థిక కష్టాల్లో ఆదుకునే ఆపన్నహస్తం. అందుకే, భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొంటారు.


2000 రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) చెలామణి నుంచి వెనక్కు తీసుకున్న తర్వాత పసిడి ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. పింక్‌ నోట్లను వెనక్కు ఇచ్చేసిన ప్రజలు, ఎల్లో మెటల్‌లో పెట్టుబడులు పెంచారు. ఒకవేళ మీరు బంగారు నగలు కొనాలని ప్లాన్‌ చేస్తున్నా, లేదా ఇప్పటికే మీ ఇంట్లో గోల్డ్‌ ఉన్నా.. ఆదాయ పన్ను చట్టంలోని (Income Tax Act) నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఆదాయ పన్ను అధికార్ల కన్ను మీ మీద పడకుండా ఉండాలంటే, మీ ఇంట్లో ఎంత పసుపు లోహం ఉంచుకోవచ్చు, బంగారంపై వచ్చే ఆదాయానికి ఎంత పన్ను కట్టాలి వంటి విషయాలను అర్ధం చేసుకోవాలి.


ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?
ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు రుజువులు చూపగలిగితే, మీ ఇంట్లో ఎంత బంగారమైనా నిల్వ చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఒకవేళ, మీ దగ్గర ఉన్న బంగారానికి ఎలాంటి రుజువులు లేకపోతే, ఇంట్లో నిల్వ చేయడంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం, ఎలాంటి రుజువు చూపకుండా బంగారు ఆభరణాలు కలిగి ఉండే పరిమితి ముగ్గురు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. 


వివాహిత మహిళ: పెళ్లైన మహిళ, తన ఇంట్లో అర కేజీ లేదా 500 గ్రాముల వరకు బంగారం/ బంగారు ఆభరణాలను దాచుకోవచ్చు. ఈ పరిమితి మించనంత వరకు ఆదాయ పన్ను అధికార్లకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బంగారం పెళ్లైన మహిళకు వారసత్వంగా వచ్చినట్లు లేదా కొనుక్కున్నట్లు లేదా బహుమతుల రూపంలో వచ్చినట్లు ఐటీ విభాగం భావిస్తుంది. 


అవివాహిత మహిళ: వివాహం కాని మహిళ తన ఇంట్లో పావు కేజీ లేదా 250 గ్రాముల వరకు గోల్డ్‌ దాచుకోవచ్చు. ఇది కూడా ఆమెకు వారసత్వంగా వచ్చినట్లు లేదా కొనుక్కున్నట్లు లేదా బహుమతుల రూపంలో వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం పరిగణిస్తుంది.


పురుషులు: వివాహం అయినా, కాకపోయినా పురుషులు కేవలం 100 గ్రాముల బంగారం మాత్రమే తన వద్ద ఉంచుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ఆదాయ పన్ను అధికార్లకు లెక్క చెప్పాలి. ఆ గోల్డ్‌ ఎలా వచ్చిందో రుజువులు చూపించాలి.


బంగారంపై పన్ను ఎలా విధిస్తారు?
బంగారం పరోక్ష పన్నుల వర్గంలోకి వస్తుంది. బంగారం నాణ్యత, సేవలు వంటి విషయాలపై పన్ను శాతం ఆధారపడి ఉంటుంది. బంగారు కడ్డీలు, నాణేలు, ఆభరణాల కొనుగోలుపై 3% GST చెల్లించాలి. ఆభరణాలు, స్వర్ణకార సేవలకు సంబంధించిన 5% GST చెల్లించాలి. బంగారాన్ని దిగుమతి చేసుకుంటే.. కస్టమ్స్ డ్యూటీ, వ్యవసాయ మౌలిక సదుపాయాలు & అభివృద్ధి సెస్, GST చెల్లించాలి.


బంగారం కొనుగోలుపై ప్రత్యక్ష పన్ను వర్తించదు. అయితే, కొనుగోలు సమయంలో అందించిన పాన్ ద్వారా కొనుగోలుదారు వివరాలు ఐటీ డిపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళ్తాయి.


ఇంట్లో ఉన్న బంగారం గురించి ఐటీఆర్‌లో చెప్పాలా?
ఒక ఆర్థిక సంవత్సరంలో టాక్స్‌ పేయర్‌ మొత్తం ఆదాయం రూ.50 లక్షలు దాటితే, ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) దాఖలు చేసే సమయంలో, దేశీయ ఆస్తుల్లో భాగంగా బంగారం వివరాలు వెల్లడించాలి.


బంగారం అమ్మితే ఎంత పన్ను చెల్లించాలి?
ఒకవేళ బంగారాన్ని లాభానికి అమ్మితే, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) వర్తిస్తుంది. మీరు కొన్న తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు పసిడిని అమ్మితే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఈ కేస్‌లో ఇండెక్సేషన్ ప్రయోజనం + 20% పన్ను రేటు వర్తిస్తుంది. హోల్డింగ్ వ్యవధి 3 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, లాభంపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి. 


మరో ఆసక్తికర కథనం: స్టేట్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరిగాయి, FDపై మంచి ఆదాయం, కొత్త రేట్లు ఇవిగో