SBI New FD Interest Rates: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India), తన కస్టమర్లు మరింత ఎక్కువ సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల వడ్డీ రేట్లను ఎస్‌బీఐ (SBI Fixed Deposit Interest Rates) సవరించింది. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ విలువైన ఎఫ్‌డీ ఫథకాలపై & 2 కోట్ల రూపాయల కంటే కంటే ఎక్కువ విలువైన ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వ రంగ బ్యాంక్ పెంచింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త రేట్లు ఈ రోజు (బుధవారం, 15 మే 2024) నుంచి అమలులోకి వచ్చాయి.
రిటైల్ ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ రేట్లు
రెండు కోట్ల రూపాయల లోపు (రిటైల్) ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లలో బ్యాంక్ చాలా పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు, 46 రోజుల నుంచి 179 రోజుల వరకు గడువుతో ఉండే FD స్కీమ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ 75 బేసిస్ పాయింట్లు (0.75% లేదా ముప్పావు శాతం) పెరిగింది. కొత్త రేట్ల ప్రకారం, ఈ కాల గడువులో సాధారణ కస్టమర్లు (60 ఏళ్ల వయస్సు లోపు ఉన్న కస్టమర్లు) 4.75 శాతానికి బదులుగా 5.50 శాతం వడ్డీ రేటును పొందుతారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లు) అదే కాలానికి 5.25 శాతానికి బదులుగా 6 శాతం వడ్డీ ఆదాయం పొందుతారు.
180 నుంచి 210 రోజుల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ మెచ్యూరిటీ పిరియడ్ ఉన్న ఎఫ్‌డీలపై సాధారణ కస్టమర్లు ఇప్పుడు 5.75 శాతానికి బదులుగా 6 శాతం వడ్డీ ప్రయోజనం పొందుతారు. ఇక్కడ సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ లభిస్తుంది.
211 రోజుల నుంచి 1 సంవత్సరం టెన్యూర్ ఉన్న FDలపై సాధారణ కస్టమర్లు 6.00 శాతానికి బదులుగా 6.25 శాతం & సీనియర్ సిటిజన్‌లు 6.50 శాతానికి బదులు 6.75 శాతం వడ్డీ రేటును అందుకుంటారు.
బల్క్ ఎఫ్‌డీ రేట్లలోనూ మార్పులు
రెండు కోట్ల రూపాయలు దాటిన (బల్క్) ఎఫ్‌డీ రేట్లను కూడా స్టేట్ బ్యాంక్ మార్చింది. 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై వడ్డీ రేటును SBI (0.25% లేదా పావు శాతం) బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ కాల గడువులో, సాధారణ కస్టమర్లకు 5.00 శాతానికి బదులుగా 5.25 శాతం వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 5.50 శాతానికి బదులుగా 5.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
46 నుంచి 179 రోజుల బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు (0.50% లేదా అర శాతం) పెంచింది. ఇప్పుడు, ఈ మెచ్యూరిటీ కాలంలో, సాధారణ కస్టమర్లకు 5.75 శాతానికి బదులుగా 6.25 శాతం & సీనియర్ సిటిజన్లకు 6.25 శాతానికి బదులుగా 6.75 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
180 నుంచి 210 రోజుల బల్క్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు (0.10%) పెంచింది. ఈ టైమ్ పిరియడ్‌లో సాధారణ కస్టమర్లకు 6.50 శాతానికి బదులుగా 6.60 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.00 శాతానికి బదులుగా 7.10 శాతం వడ్డీ ఆదాయం అందుతుంది. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల బల్క్ ఎఫ్‌డీ పథకంపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు (0.20%) పెరిగింది. ఈ కాలానికి, కస్టమర్లకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డీ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్ల పెరిగింది. కొత్త రేటు ప్రకారం, ఈ టైమ్ పిరియడ్‌లో సాధారణ కస్టమర్లకు 7 శాతం వడ్డీ రేటు & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును స్టేట్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.
మరో ఆసక్తికర కథనం: ఐదు రోజుల్లోనే 100కు 55 రూపాయలు లాభం, ధనలక్ష్మిని మరిపించిన షేర్లు