Home Loan EMIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన రెపో రేటును పెంచనప్పటికీ, గృహ రుణం మీద వడ్డీ రేట్లు (Interest rates on home loan) ఇప్పటికీ గరిష్ట స్థాయిలో ఉన్నాయి. కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 40 సంవత్సరాల కాల వ్యవధికి కూడా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇది దీర్ఘకాలిక గృహ రుణం (Long Term Home Loan) అవుతుంది.


మీరు దీర్ఘకాలంలో తిరిగి చెల్లించేలా హౌసింగ్‌ లోన్‌ తీసుకుంటే, మీ లోన్ EMI అమౌంట్‌ తగ్గుతుంది. తక్కువ EMI అమౌంట్‌ల ద్వారా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా లోన్‌ మొత్తాన్ని ఈజీగా తిరిగి చెల్లించవచ్చు, కానీ, లోన్‌ టెన్యూర్‌ (loan tenure) పెరిగే కొద్దీ మీరు తీర్చాల్సిన బకాయి మొత్తం కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి. లోన్‌ టెన్యూర్‌ తక్కువగా ఉంటే, EMI భారం పెరిగినా తక్కువ టైమ్‌లో, తక్కువ టోటల్‌తో అప్పును క్లియర్‌ చేయవచ్చు.


ఒకవేళ, తక్కువ EMI కోసం లాంగ్‌ టర్మ్‌ హోమ్‌ లోన్‌ మీరు తీసుకుంటే, మీరు తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఎంత పెరుగుతుందో కొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం.


ఇప్పుడు గృహ రుణంపై ఎంత వడ్డీ నడుస్తోంది?
ప్రస్తుతం, బ్యాంక్‌లు/హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీలు కంపెనీలు సంవత్సరానికి 8.5 శాతం నుంచి 10.25 శాతం మధ్య రుణాలు అందిస్తున్నాయి. మీరు 9.5 శాతం వడ్డీతో, రూ. 50 లక్షల వరకు గృహ రుణం తీసుకుని, 40 సంవత్సరాల్లో దానిని తిరిగి చెల్లించాలని అనుకుంటే, మీ EMI అమౌంట్‌ తక్కువగా ఉండవచ్చు. కానీ, మీరు ఊహించనంత ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు.


రూ. 50 లక్షల లోన్‌ + 9.5 శాతం వడ్డీ + 40 ఏళ్ల టెన్యూర్‌ = రూ. 2 కోట్లు
రూ. 50 లక్షల హౌసింగ్‌ లోన్‌ను 9.5 శాతం వడ్డీ రేటుతో 40 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటే, అప్పుడు నెలవారీ వాయిదా (EMI) మొత్తం దాదాపు రూ. 40,503 అవుతుంది. ఈ లెక్క ప్రకారం, ఈ 40 సంవత్సరాల్లో అసలు + వడ్డీ కలిపి మొత్తం ఖర్చు 1.94 కోట్ల రూపాయలు అవుతుంది. దీనికి ఇతర చార్జీలు కూడా కలిపితే మొత్తం వ్యయం రూ. 2 కోట్లకు పైగానే ఖర్చు అవుతుంది. తక్కువ EMIతో పోతుంది కదాని మీరు ఇంత దీర్ఘకాలానికి లోన్‌ తీసుకుంటే, తీసుకున్న మొత్తం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ డబ్బును బ్యాంక్‌/హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీకి కట్టాల్సి ఉంటుంది.


రూ. 50 లక్షల లోన్‌ + 9.5 శాతం వడ్డీ + 30 ఏళ్ల టెన్యూర్‌ = రూ. 1.5 కోట్లు
మీరు, రూ. 50 లక్షల హౌసింగ్‌ లోన్‌ను 9.5 శాతం వడ్డీ రేటుతో 30 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటే, ఆ గృహ రుణంపై నెలనెలా రూ. 42,043 కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన, 40 సంవత్సరాల్లో అసలు + వడ్డీ కలిపి మొత్తం రూ. 1.51 కోట్లు చెల్లించాల్సి రావచ్చు. అంటే, లోన్‌ టెన్యూర్‌ 40 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గే సరికి దాదాపు రూ. 50 లక్షలు సేవ్‌ అయ్యాయి.


బ్యాంక్‌ల ట్రాప్‌లో పడొద్దు
హోమ్‌ లోన్‌ టెన్యూర్‌ పెరిగే కొద్దీ బాగుపడేది బ్యాంక్‌లు/హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీలు మాత్రమే. ఇదొక ట్రాప్‌ లాంటిది. లోన్‌ తీసుకున్న వాళ్లు సుదీర్ఘకాలం పాటు ఆ గుదిబండను మోస్తూనే ఉండాలి. ఈ భారం నుంచి మీరు బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి. ఏటా/ మీ జీతం లేదా ఆదాయం పెరిగిన ప్రతిసారి మీ EMI మొత్తాన్ని 10% చొప్పున పెంచుకుంటూ వెళ్లండి. దీనివల్ల, దాదాపు 25 సంవత్సరాల్లోనే మీ అప్పు పూర్తిగా తీరిపోతుంది. మీ దగ్గర కొంత మొత్తం డబ్బు ఉంటే, వెంటనే దానిని లోన్‌ కింద జమ చేయండి. దీనివల్ల అసలు తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా EMI టెన్యూర్‌ కూడా తగ్గుతుంది.


మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్‌ ఫండ్స్‌ ముచ్చటపడి కొన్న టాప్‌-10 లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌