Home Price Rise: 


దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో 2023 తొలి మూడు నెలల్లో ఎనిమిది శాతం పెరిగాయి. టాప్‌ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టినప్పటికీ డిమాండ్‌ బాగుందని క్రెడాయి, కొలియెర్స్‌, లియాసెస్‌ ఫోరాస్‌ జాయింట్‌ రిపోర్టు నివేదించింది. వార్షిక ప్రాతిపదికన దిల్లీ-నోయిడా ప్రాంతంలో రెసిడెన్షియల్‌ ఇళ్ల ధరలు 16 శాతం పెరిగాయి. కోల్‌కతా (15%), బెంగళూరు (14%) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


హైదరాబాద్‌ మహా నగరంలో చదరపు గజం సగటు 2023 తొలి మూడు నెలల్లో రూ.10,410గా ఉంది. చివరి క్వార్టర్‌తో పోలిస్తే 3 శాతం, వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే 13 శాతం పెరిగింది. ఇక కొవిడ్‌ ముందునాటితో పోలిస్తే ఇళ్ల ధరలు ఏకంగా 46 శాతం వరకు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన 4BHK ధరలైతే 23 శాతం ఎగిశాయి. ఇదే సమయంలో అమ్ముడవ్వని ఇళ్లు 38 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ. గచ్చిబౌలి, కొండాపుర్‌, నానక్‌రామ్ గూడ, కోకాపేట ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు ఆరంభం కావడంతోనే అమ్ముడవ్వని ఇళ్ల సంఖ్య పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను పెంచినప్పటికీ ఇళ్ల ధరలు పెరుగుదల ఆగలేదు. గతేడాదితో పోలిస్తే డిమాండ్‌ నిలకడగా ఉండటమే ఇందుకు కారణం. రెపోరేట్ల పెంపు నిలిపివేస్తున్నట్టు శక్తికాంత దాస్‌ ప్రకటించడంతో రియాల్టీ రంగం ఆశాజనకంగా కనిపిస్తోంది. డిమాండ్‌ ఇంకా పెరుగుతుందని ధీమా ఉంది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు మొదలవ్వడంతో దేశవ్యాప్తంగా అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ వార్షిక ప్రాతిపదికన 12 శాతం పెరిగింది. ఇందులో 95 శాతం ఇళ్లు ఇంకా నిర్మాణదశలోనే ఉన్నాయి.


హైదరాబాద్‌లో 38 శాతం, ముంబయిలో 37 శాతం, పుణెలో 13 శాతం ఇళ్లు అమ్ముడుపోలేదు. దిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రం అన్‌సోల్డ్‌ ఇన్వెంటరీ కాస్త తగ్గింది. '2022, మే నుంచి ఆర్బీఐ ఇప్పటి వరకు 250 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచింది. అయినప్పటికీ 2022, 2023 తొలి త్రైమాసికంలో రెసిడెన్షియల్‌ సెక్టార్‌ పటిష్ఠంగానే కనిపించింది. వడ్డీరేట్లు పెరిగినా ఇళ్ల డిమాండ్‌ తగ్గలేదు. డెవలపర్లు సరైన ధర, సరైన ప్రాంతాల్లో ఇళ్లను సకాలంలో డెలివరీ చేస్తుండటంతో 2023లో స్తిరాస్థి రంగం ఔట్‌లుక్‌ మెరుగ్గా ఉంటుంది' అని కొలియెర్స్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌, హెడ్‌ ఆఫ్ రీసెర్చ్‌ విమల్‌ నాడర్‌ అన్నారు.


Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో SIP మాత్రమే కాదు, STP కూడా ఉంది తెలుసా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.