Bank Of Maharashtra Home Loan Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తన రెపో రేటును నిరంతరం పెంచడంతో, దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల అప్పులు ఇప్పుడు ఖరీదుగా మారాయి. 


ప్రభుత్వ రంగ బ్యాంకు, పుణె కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రం గృహ రుణాల మీద వడ్డీ రేటును తగ్గించింది. హౌస్‌ లోన్‌ ఇంట్రెస్ట్‌ రేటను 20 బేసిస్ పాయింట్లు లేదా 0.20 శాతం తగ్గించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర గృహ రుణ రేటు ఎంత?
రేటు తగ్గింపు తర్వాత, అతి తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫర్‌ కూడా ఒకటిగా మారింది. ఇప్పుడు, ఈ బ్యాంకు గృహ రుణంపై 8.40 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. గృహ రుణ అడ్వాన్స్‌లు, రిటైల్ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి తమ వ్యాపార ప్రణాళికలో ఒక భాగమని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (BoM) మేనేజింగ్‌ డైరెక్టర్‌ AS రాజీవ్ తెలిపారు. మంచి సిబిల్‌ స్కోర్ (CIBIL Score‌) ఉన్న వారి కోసం ఈ తక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. డిఫాల్టర్‌కు (రుణ ఎగవేతదారుగా ముద్ర పడిన వ్యక్తి) రుణాలు ఇవ్వబోమని అన్నారు. 


బంగారం, కారు రుణాలపై ప్రాసెసింగ్ రుసుము రద్దు
గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించడం మాత్రమే కాదు.. కార్‌ లోన్‌, గోల్డ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజులను కూడా కొన్నాళ్ల క్రితమే రద్దు చేసింది.


వడ్డీ రేట్లు తగ్గించిన మరో రెండు బ్యాంకులు
గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు కూడా గృహ రుణాల మీద వడ్డీ రేట్లను తగ్గించాయి. 


బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), తన గృహ రుణాల రేటును 40 బేసిస్ పాయింట్లు లేదా 0.40 శాతం మేర తగ్గించింది. దీనివల్ల BoB గృహ రుణ రేటు 8.50 శాతానికి దిగి వచ్చింది. దీంతో పాటు, MSME రుణాలపై కూడా వడ్డీ రేటును కూడా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తగ్గించింది. MSME రుణాలపై, ఈ బ్యాంక్‌ కొత్త వడ్డీ రేటు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. గృహ రుణాలపై వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ ఆఫ్ బరోడా పూర్తిగా మాఫీ చేసింది. MSME రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 50% డిస్కౌంట్‌ ప్రకటించింది. 


బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్ల విషయంలో జరిగిన రెండు మార్పులు మార్చి 05, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి, ఈ నెలాఖరు వరకు, మార్చి 31, 2023 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఈ మేరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు ఈ చౌక రుణ రేట్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఈ నెల 31వ తేదీ లోగా రుణం తీసుకోవలసి ఉంటుంది. రుణాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే 8.5 శాతం గృహ రుణ రేటును అందిస్తామని బ్యాంక్ ఆఫ్‌ బరోడా తన ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు, ఈ చౌక రుణాలను బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌, అప్‌గ్రెడేషన్‌ కింద కూడా తీసుకోవచ్చు. కొత్త రేట్లు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటాయని బ్యాంక్ తెలిపింది. సొంతింటి కల ఉన్నవారు, వర్ధమాన పారిశ్రామికవేత్తలు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఇదొక సదవకాశంగా వివరించింది.