Home Insurance  Benefits: ఈమధ్య కాలంలో ఉత్తర, ఈశాన్య భారతదేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ను ఊడ్చేసిన భయంకర వర్షాల నుంచి అసోంను ముంచేసిన భారీ వరదల వరకు, ఆ ప్రకృతి వైపరీత్యాలు ప్రత్యక్ష నరకాన్ని చూపాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలకు 300 మందికి పైగా చనిపోయారు, వేలాది మంది ఇళ్లను కోల్పోయారు. అసోంలో వరదల కారణంగా ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు.


ఈ ప్రకృతి విపత్తుల్లో కొందరి ఇళ్లు నీళ్లలో మునిగిపోగా, మరికొందరి ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అవి, ఇంటికి మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించాయి. ఇల్లు అనేది తలపై కనిపించే కప్పు మాత్రమే కాదు, అది కుటుంబం మొత్తానికి ఆర్థిక భద్రత, గొప్ప ఆస్తి. ప్రజలు తమ ఇంటితో ఎమోషనల్‌గా అటాచ్‌ అయి ఉండటానికి ఇదే కారణం. కాబట్టి, ఇల్లు కూడా మన కుటుంబ సభ్యురాలే, దాని భద్రత కూడా ముఖ్యమే.


ఊహించని విపత్తులు, పెరుగుతున్న అనిశ్చితి వ్ల గృహ బీమా (Home Insurance) అవసరం పెరుగుతోంది. హోమ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఇంటికి ఒక రక్షిత బంధనం. వరదలు, భూకంపం, అగ్నిప్రమాదం వంటి అన్ని సహజ సంఘటనల వల్ల కలిగే నష్టాల నుంచి మీ ఇంటికి పూర్తి ఆర్థిక రక్షణను అందిస్తుంది. ఇంటి పునర్నిర్మాణం, మరమ్మతుల వంటి పనులకు కూడా సాయం చేస్తుంది.


గృహ బీమాలో ఏయే అంశాలు కవర్‌ అవుతాయి?
సాధారణంగా, ఇంటి గోడలు, పైకప్పు, అంతస్తులు సహా ఇంటి నిర్మాణానికి కలిగే నష్టాన్ని హోమ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఫర్నీచర్, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు వంటి వ్యక్తిగత వస్తువులకు నష్టం జరిగినా బీమా కవరేజ్‌ ఉంటుంది. నష్టం కారణంగా మీరు మీ ఇంటిని వదిలేసి వేరే చోట అద్దెకు ఉండవలసి వచ్చినా కూడా బీమా వర్తిస్తుంది. గృహ బీమా అనేది మీ ఇల్లు & మీ మనశ్శాంతి రెండింటికీ రక్షణ పొర లాంటిది.


ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి
అయితే, ప్రతీదీ బీమా పరిధిలోకి రాదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పేలవమైన నిర్వహణ లేదా నిర్లక్ష్యం కారణంగా సంభవించే నష్టం గృహ బీమా పరిధిలోకి రాదు. దీంతోపాటు... ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వంటి కొన్ని ఖరీదైన వస్తువుల కవరేజ్‌ కోసం రైడర్స్ (అదనపు కవరేజ్) అవసరం ఉంటుంది. వరదల వంటి విపత్తుల వల్ల కలిగే అన్ని నష్టాలను ప్రామాణిక పాలసీ కవర్ చేయకపోవచ్చు. కాబట్టి, అన్ని సంఘటనలను, అన్ని నష్టాలను కవర్ చేసే సమగ్ర పాలసీ కొనుగోలు చేయడం మంచిది.


ఎంత కవరేజ్ ఉండాలి?
పాలసీని కొనే సమయంలో గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం.. ఎంత కవరేజీ ఉండాలి?. ఇది, అవసరాలు, పరిస్థితులను బట్టి మారుతుంది. సాధారణంగా, మీ ఇల్లు ఎంత పెద్దది అనే అంశంపై బీమా మొత్తం ఆప్షన్‌ ఆధారపడి ఉంటుంది.


హోమ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో రకాలు
ఇంటి బీమా పాలసీల్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. అవి... స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ పాలసీ (Standard Fire and Special Perils Policy), కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ (Comprehensive Home Insurance Policy)‍. 


స్టాండర్డ్ ఫైర్ అండ్ స్పెషల్ పెరిల్స్ పాలసీ... అగ్నిప్రమాదం లేదా పిడుగులు వంటి లిస్ట్‌లో ఉన్న నిర్దిష్ట అంశాల వల్ల ఏర్పడే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ పాలసీ కొన్ని ప్రమాదాలకు మాత్రమే వర్తిస్తుంది. కాంప్రహెన్సివ్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీ... వరదలు, తుపానులు, భూకంపం సహా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే అన్ని రకాల ప్రమాదాల వల్ల కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. కాబట్టి, మీరు హోమ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకుంటే సమగ్ర గృహ బీమా పాలసీని ఎంచుకోవడం ఉత్తమం.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial