Health Insurance: 


ఆర్థిక మాంద్యం.. ఆర్థిక మందగమనం.. అనే మాటలు వినగానే ఉద్యోగుల గుండెలు గుభేల్‌మంటాయి! ఎందుకంటే వారికి ఎలాంటి ప్రమోషన్లు ఉండవు. ఆశలు పెట్టుకున్న బోనస్‌లు, వేరియబుల్‌ పేమెంట్లు రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికే ఎసరు వస్తుంది. లేఆఫ్‌ల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరికొన్ని సార్లు ఉద్యోగి అనుకోకుండా రాజీనామా చేయాల్సి వస్తుంది.


కంపెనీల్లో పనిచేస్తుంటే ఉద్యోగికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైంది ఆరోగ్య బీమా! చాలా వరకు అన్ని వ్యాధులు కవర్‌ అవుతాయి. ఉద్యోగి భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు బీమా కవరేజీ లభిస్తుంది. మరి రాజీనామా లేదా లేఆఫ్‌ పడ్డప్పుడు బీమా ప్రయోజనాలు కోల్పోవద్దంటే ఏం చేయాలో చూద్దాం!


రాజీనామా చేసినా లేఆఫ్‌ ఎదురైనా ఆ ఆర్థిక ఏడాది మొత్తం ఆరోగ్య బీమా కొనసాగించేందుకు అవకాశం ఉంది. మొబైల్‌ పోర్టబిలిటీ తెలుసు కదా! అలాగే కంపెనీ కల్పిస్తున్న ఆరోగ్య బీమాను పోర్టబిలిటీ చేసుకోవచ్చు. గ్రూప్‌ పాలసీని వ్యక్తిగత ఇన్సూరెన్స్‌ పాలసీగా మార్చుకోవచ్చు. పోర్టబిలిటీ సమయంలో మీ అవసరాలకు తగినట్టుగా ఆ పాలసీని మార్చుకొనే ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. ఎలాగో చూద్దాం!


ఉదాహరణకు ఒక వ్యక్తి ఓ పెద్ద టెక్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని అనుకుందాం. ఉద్యోగంలో ఉండగా ఎన్నో ప్రయోజనాలు పొందాడు. ముఖ్యంగా ఆరోగ్య బీమా నుంచి అతడి కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరింది. గ్లోబల్‌ స్లో డౌన్‌తో అతడి ఉద్యోగం పోయింది. దాంతో అతడికి కంగారు మొదలైంది. తన కుటుంబానికి ఆరోగ్య బీమా లేకపోతే ఎలా అన్న భయం పట్టుకుంది. కొందరు మిత్రుల సలహా మేరకు ఆరోగ్య బీమా పోర్టబిలిటీ గురించి తెలుసుకొనేంత వరకు అతడి ఆందోళన పోలేదు.


లేఆఫ్‌కు గురైన వాళ్లు, ఉద్యోగానికి రాజీనామా చేసినవాళ్లు నోటీస్‌ పీరియెడ్‌లో మీ కంపెనీ ఆరోగ్య బీమా పాలసీని పూర్తిగా సమీక్షించండి. అందులోని పరిమితులు, షరతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. సునాయాసంగా పోర్టబిలిటీ చేసుకోవడానికి ఉన్న అవకాశాలను గమనించి హెచ్‌ఆర్‌ను కలవండి. ఉద్యోగంలో మీ ఆఖరి రోజుకు 30-45  రోజుల ముందుగానే వారికి సమాచారం ఇవ్వండి. దాంతో పోర్టబిలిటీ ప్రక్రియ సులువు అవుతుంది.


కార్పొరేట్‌ పాలసీని వ్యక్తిగత పాలసీగా మార్చుకోవడం వల్ల ప్రయోజనాల్లో ఎలాంటి కోతలు ఉండవు. మీరు వ్యక్తిగత బీమాను ఎంచుకోగానే అవసరమైన పత్రాలను హెచ్‌ఆర్‌కు ఇవ్వండి. ఆ తర్వాత స్వల్ప కాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ సమయంలో బీమా కంపెనీ మీ ప్రతిపాదనను సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటుంది.


సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న వారికి వెయిటింగ్‌ పీరియెడ్‌ వేవియర్‌ ఉంటుంది. అలాగే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. రాజీనామా, లేఆఫ్‌ టైమ్‌లోనే కాదు. ఏడాది మధ్యలో పదవీ విరమణ పొందినవాళ్లకూ పోర్టబిలిటీ ఆప్షన్‌ ఉంటుంది.


Also Read: షూరిటీ లేకుండా లోన్‌, పైగా వడ్డీ తక్కువ - ఎల్‌ఐసీ పాలసీ ఉంటే చాలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.