Bank Interest Rate Hike: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (DFC Bank), తన వడ్డీ రేట్లను పెంచింది. దీంతోపాటు.. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (Indian Overseas Bank - IOB) కూడా రుణ రేట్లను పెంచింది. 


మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌కు (MCLR) అనుసంధానంగా ఉన్న అన్ని రకాల రుణాల మీద వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్లు లేదా 0.25 శాతం మేర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెంచింది. ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, తన MCLR ఆధారిత వడ్డీ రేటును 5 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.05 శాతం పెంచింది. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త వడ్డీ రేట్లు శనివారం నుంచి (07 జనవరి 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పెంచిన MCLR రేట్లు మంగళవారం (జనవరి 10, 2023) నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ప్రకారం, ఇప్పటికే ఇచ్చిన రుణాలు, కొత్తగా ఇవ్వబోయే రుణాలు మరింత ఖరీదైనవిగా మారాయి.


HDFC బ్యాంక్ MCLR ఎంత పెరిగింది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేట్లను 0.25 శాతం పెంచడంతో... రేట్లు ప్రస్తుత 8.60 శాతం నుంచి 8.85 శాతానికి పెరిగాయి. HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం... ఒక రోజు (ఓవర్‌ నైట్‌ ) రుణాల మీద వసూలు చేసే MCLR రేటు 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల MCLR ను అంతకు ముందున్న 8.30 శాతం నుంచి ఇప్పుడు 8.55 శాతానికి పెంచింది. అదే సమయంలో, ఒక సంవత్సరం MCLR గతంలో 8.60 శాతంగా ఉండగా.. 0.25 శాతం పెంపు తర్వాత 8.85 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8.70 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ 8.80 శాతం నుంచి ఇప్పుడు 9.05 శాతానికి పెరిగింది.


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ MCLR ఎంత పెరిగింది?
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా, వివిధ కాలాల సంబంధించిన రుణాల మీద తన MCLR రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.05 శాతం పెంచింది. దీంతో, IOB రుణం రేట్లు ఇప్పుడు 7.70 శాతం నుంచి 8.45 శాతం పరిధిలోకి చేరినట్లు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ప్రకారం తెలుస్తోంది. అంటే, కనిష్ట రుణ రేటు 7.70 శాతంగా, గరిష్ట రుణ రేటు 8.45 శాతంగా మారింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.


వడ్డీ రేటు పెంచిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank)
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) కూడా తన వడ్డీ రేట్లను పెంచింది. MCLR ను ఇది 0.15 శాతం నుంచి 0.20 శాతానికి పెంచింది. దీని కారణంగా ఈ బ్యాంకు వడ్డీ రేట్లు 8.40 శాతం నుంచి 9.50 శాతం పరిధిలోకి చేరాయి.