GST Relief On Health Insurance: జీవిత బీమా & ఆరోగ్య బీమాపై GST (Goods and Services Tax) తగ్గవచ్చు & అతి త్వరలో నిర్ణయం వెలువడవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం (GST Council Meeting) త్వరలో జరగనుంది. జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో, దీనిని 5 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. దీనిపై ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనం కొనసాగుతుంది. జీఎస్టీ రేటు తగ్గింపు కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లవచ్చు. 


పూర్తి రద్దు కాదు, గణనీయమైన ఉపశమనం
పన్ను రేట్లను సమీక్ష కోసం, GST కౌన్సిల్ ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM)లోని చాలా మంది సభ్యులు జీవిత బీమా & ఆరోగ్య బీమా ప్రీమియంలపై GSTని తగ్గించడానికి అనుకూలంగా ఉన్నారు, దీనిపై ప్రతిపాదనలతో కూడిన నివేదికను కూడా సిద్ధం చేశారు. బీమా ప్రీమియంలపై GSTని పూర్తిగా తొలగించడాన్ని మంత్రుల బృందంలోని మెజారిటీ సభ్యులు సమర్థించడం లేదని సమాచారం. జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడానికి బదులు భారాన్ని తగ్గించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. బీమా పరిశ్రమ డిమాండ్‌ కూడా దాదాపుగా ఇదే. ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడానికి బదులు, గణనీయంగా తగ్గించాలని ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ చాలా ఏళ్లుగా కోరుతోంది. జీఎస్‌టీని పూర్తిగా రద్దు చేస్తే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కోల్పోతామన్నది బీమా కంపెనీల భయం.   


జీఎస్టీ కౌన్సిల్ కోర్టులోకి మారిన బంతి
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించడంపై 'బీమా రంగ నియంత్రణ సంస్థ' IRDAI కూడా తన అభిప్రాయాన్ని ఇటీవలే సమర్పించింది. దీంతో, బంతి జీఎస్టీ కౌన్సిల్ కోర్టులోకి మారింది & తుది నిర్ణయం అక్కడ తీసుకుంటారు. ఏప్రిల్‌ నెలాఖరులో గానీ, మే నెలలో గానీ కౌన్సిల్ సమావేశం ఉండొచ్చు.       
 
2024 డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశం జరిగింది. ఆరోగ్య & జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు లేదా తగ్గింపు నిర్ణయాన్ని అప్పుడే తీసుకుంటారని అంతా భావించారు. అన్ని రాష్ట్రాలు కూడా అప్పట్లోనే ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. కానీ, బీమా నియంత్రణ సంస్థ నుంచి తదుపరి సమాచారం వచ్చే వరకు, అంటే తదుపరి కౌన్సిల్‌ సమావేశం వరకు ఆ నిర్ణయం వాయిదా పడింది.       


జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేటును తగ్గించాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా దీనిని సిఫార్సు చేసింది. గత మూడు సంవత్సరాలలో, ఆరోగ్య బీమా ప్రీమియంపై GSTగా రూ. 21,256 కోట్లు & ఆరోగ్య బీమా ప్రీమియం రెన్యువల్‌పై GSTగా రూ. 3274 కోట్లు వసూలయ్యాయి. మన దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్య బీమాపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది.