Indian Rupee At 85.61 Against US Dollar: దేశీయ స్టాక్ మార్కెట్ పెరుగుదలతో ఖుషీగా ఉన్న ఇన్వెస్టర్లకు మరో శుభవార్త. యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే క్రమంగా బలపడుతున్న భారతీయ రూపాయి, ఇప్పుడు, 2025 వరకు ఉన్న అన్ని నష్టాలను పూడ్చుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్, FIIల తాజా పెట్టుబడుల కారణంగా, సోమవారం (24 మార్చి 2025) ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 37 పైసలు పెరిగి రూ.85.61 వద్ద ముగిసింది. దీంతో, 2024 వరకు ఉన్న నష్టాలు పూర్చుకున్నట్లయింది. 2024 డిసెంబరు 31న డాలర్‌ విలువ రూ.86.64 వద్ద ఉంది. ఇప్పడు అంతకన్నా కాస్త మెరుగైన స్థితిలో ఉంది.

వరుసగా ఏడో సెషన్‌లోనూ బలంవరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్‌లోనూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. గత నెలలో (ఫిబ్రవరి 2025), అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 87.59 వద్దకు పతనమైంది. రూపాయి విలువ ఇంకెంత దిగజారుతుందోని ఆందోళనలు వెల్లవెత్తిన సమయంలో, క్రమంగా కోలుకోవడం ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసొచ్చి రూపాయి బలపడుతోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గడం, డాలర్ ఇండెక్స్‌ నిరంతరం బలహీనపడటం కూడా రూపాయిపై సెంటిమెంట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే.. నగదు కొరత నుంచి ప్రతీకార సుంకాల వరకు కొన్ని విషయాలు రూపాయికి ఇప్పటికీ సవాల్‌ విసురుతున్నాయి.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్‌ ఎక్సేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌కు రూపాయి 85.93 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో, ఇది గరిష్టంగా 85.49 స్థాయిని & కనిష్టంగా 86.01 స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.61 వద్ద ముగిసింది. మునుపటి సెషన్‌ (శుక్రవారం) ముగింపు స్థాయి కంటే 37 పైసలు పెరిగింది. శుక్రవారం నాడు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 38 పైసలు బలపడి రూ.85.98 వద్ద స్థిరపడింది. గత 7 రోజుల్లో, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 154 పైసలు పెరిగింది. 

విదేశాల్లో చదివే విద్యార్థులకు ఊరట డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడడం భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గొప్ప ఉపశమనం. భారత్‌ నుంచి డబ్బు పంపే తల్లిదండ్రలపై ఆర్థిక భారం తగ్గుతుంది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకునే వ్యాపారులకు కూడా ఇది సంతోషం కలిగించే విషయం, వీళ్లు కూడా గతం కంటే తక్కువ చెల్లిస్తే సరిపోతుంది.

ఏప్రిల్ 02 నుంచి ప్రతీకార సుంకాలు అమల్లోకి రాకముందే, అమెరికా ప్రతినిధి భారతదేశాన్ని సందర్శిస్తారని ప్రకటించడంతో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో FIIలు కొనుగోళ్లు చేపట్టడం కూడా రూపాయికి డిమాండ్‌ పెంచింది. స్వల్పకాలంలో ఇంకాస్త బలపడినా, ఆ తర్వాత కొంత పతనం ఉండొచ్చు. రూపాయికి 85.20 వద్ద నిరోధం, 86.05 వద్ద మద్దతు ఉన్నాయి -  HDFC సెక్యూరిటీస్ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్ పర్మార్

ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే US డాలర్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.09 శాతం తగ్గి 103.99కి చేరుకుంది.

అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌కు 0.54 శాతం పెరిగి 72.55 డాలర్లకు చేరుకుంది.

దేశీయ స్టాక్ మార్కెట్లో BSE సెన్సెక్స్ 1,078.87 పాయింట్లు పెరిగి 77,984.38 పాయింట్ల వద్ద ముగియగా, NSE నిఫ్టీ 307.95 పాయింట్లు పెరిగి 23,658.35 పాయింట్ల వద్ద ముగిసింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.