Best Pension Plan 2024: ప్రతి ఉద్యోగికి, ఉద్యోగ సమయంలో జీతం రూపంలో నెలనెలా స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు & పెళ్లిళ్లు, అనారోగ్య సమస్యలు, పొదుపు & పెట్టుబడులు లాంటివన్నీ ఆ జీతంలో కొట్టుకుపోతాయి. రిటైర్మెంట్ తర్వాత అసలు ఆట ఆరంభమవుతుంది. ఆఫీస్‌తో తెగదెంపులు చేసుకోగానే ఆదాయం ఆగిపోతుంది. ముఖ్యంగా, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నవారికి ఇదొక పెద్ద సమస్య. 60 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత వారికి పింఛను అందకపోతే జీవనసాగరాన్ని ఈదలేరు. ముందు నుంచే పక్కాగా ప్లాన్ చేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత కూడా జాలీగా గడపొచ్చు.
తన యవ్వనాన్ని, శక్తిసామర్థ్యాలను, కాలాన్ని ధారపోసి సీనియర్ సిటిజన్ అయ్యేవరకు ఉద్యోగం చేసిన వ్యక్తి, రిటైర్మెంట్ తర్వాత డబ్బుకు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. ఆ పథకం పేరు 'జాతీయ పింఛను పథకం' లేదా 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (National Pension System - NPS). వాస్తవానికి, ఈ స్కీమ్‌ను గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రారంభించారు. తర్వాత, ఈ పథకం ప్రయోజనాలను అందరికీ విస్తరించారు. ఇప్పుడు, ఎవరైనా NPSలో పెట్టుబడి పెట్టొచ్చు, వృద్ధాప్యంలో పెన్షన్ ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగులే కాదు, వ్యాపారులు కూడా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ సహకార పథకం కాబట్టి డబ్బును నష్టపోతామన్న భయం ఉండదు. ఉద్యోగం లేదా వ్యాపారానికి గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న బెస్ట్ పెన్షన్ ప్లాన్స్‌లో ఇది ఒకటి.
చాలా చిన్న మొత్తంతో NPSలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించొచ్చు. చందాదారుకు 60 సంవత్సరాలు రాగానే ఎన్‌పీఎస్ అకౌంట్‌లో ఉన్న డబ్బును వెనక్కు తీసుకోవచ్చు. ఇక్కడో చిన్న షరతు ఉంటుంది. రిటైర్మెంట్ నాటికి NPS ఖాతాలో ఉన్న మెచ్యూరిటీ మొత్తం రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఆ మొత్తం డబ్బును ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్ నాటికి అకౌంట్‌లోని డబ్బు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, ఆ మొత్తంలో గరిష్టంగా 60% డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40% మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. చందాదారుకు ఇష్టమైతే 100% డబ్బుతోనూ యాన్యుటీ ప్లాన్ తీసుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో ఆదాయం అందుతుంది.
రూ.57 లక్షలతో హ్యాపీ రిటైర్మెంట్
ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయస్సులో NPS ఖాతా ప్రారంభించాడని అనుకుందాం. అతను ప్రతినెలా రూ.1500 (రోజుకు కేవలం 50 రూపాయలు) చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్తే, ఒక సంవత్సరంలో పెట్టుబడి మొత్తం రూ.18,000 అవుతుంది. అతనికి 60 ఏళ్ల వయస్సు (మొత్తం 35 సంవత్సరాల పాటు పెట్టుబడి) వచ్చే నాటికి పెట్టుబడి మొత్తం 6 లక్షల 30 వేల రూపాయలు అవుతుంది. అతని పెట్టుబడిపై సగటున ఏడాదికి 10 శాతం వడ్డీని లెక్కిస్తే, ఆ కార్పస్ మొత్తం 57 లక్షల 42 వేల రూపాయలు అవుతుంది.
అకౌంట్‌లో జమ అయిన మొత్తం డబ్బుతో (100% కార్పస్) యాన్యుటీ ప్లాన్ కొంటే, సగటున నెలకు రూ. 28,700 పెన్షన్ తీసుకోవచ్చు. 40% మొత్తంతో (రూ.22,96,800) యాన్యుటీ కొనుగోలు చేస్తే పెన్షన్ మొత్తం రూ. 11,485 అవుతుంది. ఇంకా అతని ఖాతాలో 34 లక్షల 45 వేల రూపాయలు ఉంటాయి, వాటిని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.
NPSలో పెట్టుబడిపై ఆదాయ పన్ను (Income tax) చెల్లించాల్సిన అవసరం లేదు. సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షలు, సెక్షన్ 80CCD కింద మరో రూ.50,000 కలిపి, ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2 లక్షలకు మినహాయింపు పొందొచ్చు.
మరో ఆసక్తికర కథనం: సొంత హెల్త్ ఇన్సూరెన్స్ Vs కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ - మీకు ఈ విషయాలు తెలియాలి