Pradhan Mantri Shram Yogi Maan-dhan Details In Telugu: పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క కుటుంబానికి చాలా కీలకం. రిటైర్మెంట్ లైఫ్‌లో ఆర్థిక భద్రత విషయంలో పెన్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది, ముఖ్యంగా ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ కోసం చాలా ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. నెలనెలా పెద్ద మొత్తంలో పింఛను తీసుకునేలా పెట్టుబడులు, పొదుపులు (Investments and Savings) చేస్తారు. ఉద్యోగులకు నెలనెలా స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి, వాళ్లు చక్కటి రిటైర్మెంట్ ప్లానింగ్ (Retirement planning) చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరికీ, ముఖ్యంగా రోజువారీ కూలీలు, కార్మికులు లేదా చిన్నపాటి ఉద్యోగాలు చేసేవాళ్లకు ఇలాంటి అవకాశం ఉండదు. వాళ్ల ఏ రోజు సంపాదన ఆ రోజు ఖర్చులకు సరిపోవడమే దీనికి కారణం. అందువల్ల, రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం డబ్బులు మిగలవు. వీళ్లను అసంఘటిత రంగ కార్మికులు (Unorganized sector workers) అంటారు.
భవిష్యత్తు కోసం ఎలాంటి పొదుపు లేని వాళ్లు భవిష్యత్తులో ఎలాంటి పెన్షన్ పొందలేరు. దేశంలోని అటువంటి అసంఘటిత రంగాల కార్మికుల కోసం భారత ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు "ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన" (PM-SYM).
పెన్షన్ ఎలా అందుతుంది, ఎంత అందుతుంది?
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజనను 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది స్వచ్ఛంద పథకం, ఈ స్కీమ్‌లో తప్పనిసరిగా చేరాలన్న నిబంధన లేదు. అయితే, ఈ స్కీమ్‌లో డబ్బు జమ చేసిన అసంఘటిత కార్మికులు అందరికీ భారత ప్రభుత్వం పెన్షన్ ప్రయోజనం అందిస్తుంది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద, 60 సంవత్సరాల వయస్సు దాటిన కార్మికులకు నెలకు రూ. 3000 వరకు పెన్షన్ అందించే నిబంధన ఉంది. ఈ పథకంలో కార్మికులు ఎంత జమ చేస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అంత మొత్తం జమ చేస్తుంది.
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల కార్మికులు ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన కింద ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టడం అవసరం. 60 ఏళ్ల వయస్సు తర్వాత నుంచి ఇందులో పెన్షన్ లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి నమోదు చేసుకోవాలి. దీని కోసం కొన్ని రకాల గుర్తింపు పత్రాలు అవసరం. అవసరమైన అన్ని పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పీఎం శ్రమ్ యోగి కార్డ్ నంబర్ జారీ అవుతుంది. దీని ద్వారా ఖాతా సమాచారాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద కార్మికుడు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం ప్రతి నెలా ఆటో డెబిట్ ద్వారా కట్ అవుతుంది. ఆ కార్మికుడికి 60 ఏళ్ల వయస్సు నుంచి పింఛను రావడం ప్రారంభం అవుతుంది.