Union Budget 2024 Expectations: మనిషికి అందాన్ని, కుటుంబానికి ఆర్థిక భరోసాను రెండింటినీ ఇచ్చే ఏకైక పెట్టుబడి సాధనం బంగారం. కాబట్టి ఇది ప్రజలకు ఇష్టసఖిగా మారింది. అయితే, ఎప్పుడు చూసినా బంగారం రేట్లు కొండపైనే కనిపిస్తుంటాయి. కొన్ని రోజుల క్రితం కాస్త దిగి వచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్లీ పైకి ఎక్కడం ప్రారంభించాయి. ప్రస్తుతం, నెల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఖరీదైన రేట్ల కారణంగా ప్రజలు బంగారం కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇది గోల్డ్ డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అయితే, బడ్జెట్ తర్వాత పసిడి ధరలు తగ్గుముఖం పడతాయన్న అంచనాలు పెరుగుతున్నాయి.
నెల గరిష్టంలో గోల్డ్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్‌లో, ఈ వారంలోనే స్వర్ణ ప్రకాశం దాదాపు 2 శాతం పెరిగింది, మరోమారు $2,400 మార్క్‌ను దాటింది. నిన్న (శుక్రవారం, 12 జులై 2024) బంగారం ఔన్స్ ధర (28.35 గ్రాములు) 2,411 డాలర్ల వద్ద ముగిసింది. గత నెలలో ఇది అత్యధిక స్థాయి. దేశీయ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. శుక్రవారం, MCXలో ఆగస్ట్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ. 73,285 వద్ద క్లోజ్ అయింది.
ఈ ఏడాది 15 శాతం జంప్
ఈ ఏడాది ప్రారంభంలో రూ. 63,870 ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ. 73,000 దాటింది. అంటే ఈ ఏడాదిలో ఇప్పటికే గోల్డ్ రేటు 15 శాతం పెరిగింది. ఈ దూకుడు ప్రభావం నేరుగా డిమాండ్‌పై కనిపిస్తోంది. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి డిమాండ్ 15 శాతం తగ్గింది. నిరంతరం ధరల పెరుగుదల కారణంగా ప్రజలు నగల షాపులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, శుభకార్యాలకు ముహూర్తాలు కూడా లేకపోవడంతో జులైలోనూ స్వర్ణాభరణాలకు గిరాకీ పెరగలేదు.
ఆభరణాల పరిశ్రమ డిమాండ్
దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ పడిపోవడంతో ఆభరణాల పరిశ్రమ కలవరపడుతోంది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, సుంకం తగ్గింపుపై బడ్జెట్‌లో ప్రకటన చేయాలని కోరుతోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలన్నది ఆభరణాల పరిశ్రమ డిమాండ్. అంతేకాదు, గోల్డ్‌పై కస్టమ్ డ్యూటీని కూడా 4 శాతానికి తగ్గించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని కొందరు ప్రసిద్ధ బంగారం వర్తకులు డిమాండ్ చేసినట్లు PTI రిపోర్ట్ చేసింది.
డిమాండ్ నెరవేరితే బంగారం ధర తగ్గుతుంది
ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌కు అనుకూలంగా ఈ బడ్జెట్‌లో (Union Budget 2024) కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే (దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే), అప్పుడు గోల్డ్ డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. కస్టమ్ డ్యూటీ తగ్గింపు దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది, నగల రేట్లను తగ్గిస్తుంది. ఇవన్నీ సాధ్యమైతే, బడ్జెట్ తర్వాత ప్రజలు చౌకగా బంగారాన్ని కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని పొందొచ్చు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
మరో ఆసక్తికర కథనం: పదేళ్లలో ఆదాయ పన్ను ఇన్ని రకాలుగా మారిందా? - తెలిస్తే ఆశ్చర్యపోతారు