Gold Price Hits All Time High: ఈ మధ్యకాలంలో, బంగారం ధరలు తరచూ కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత గోల్డ్ రికార్డ్ రన్ మరింత వేగం అందుకుంది. పసిడి రేటు గత 40 రోజుల్లో 10 సార్లు కొత్త గరిష్టాలను తాకింది, తన రికార్డ్‌లు తానే బద్ధలు కొట్టుకుంటూ పరుగులు తీసింది. ఈ రికార్డ్ మారథాన్ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
2025లో రికార్డ్‌ల మోత
ది మింట్ రిపోర్ట్ ప్రకారం, 2025 ప్రారంభం నుంచి బంగారం ధరల్లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ సంవత్సరంలో (2025) ఇప్పటి వరకు, పసిడి ప్రకాశం 10 సార్లు కొత్త ఆల్-టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 2,943 డాలర్ల దగ్గర ఉంది. భారత మార్కెట్‌లో కూడా బంగారం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రేటు రూ. 87,930 కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. గోల్డ్ రేటు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 11 శాతం పైగా పెరుగుదలను చూసింది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధర ఈ పెరుగుదల మరింత కొనసాగవచ్చు & గ్లోబల్ మార్కెట్‌లో ధర ఔన్సుకు $3,000 కు చేరుకునే అవకాశం ఉంది. ఈ పెరుగుదల వెనుక చాలా కీలక కారణాలు ఉన్నాయి. వాటిలో, ప్రధానమైనవి - మార్కెట్ అస్థిరత, ద్రవ్యోల్బణం భయం, వాణిజ్య యుద్ధం, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు.
డొనాల్డ్ ట్రంప్ విధానాలే ప్రధాన కారణం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు & ఆర్థిక నిర్ణయాల కారణంగా మార్కెట్‌లో అస్థిరత పెరుగుతోంది. ట్రంప్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల కలిసి బంగారం మంటకు ఆజ్యంగా మారాయి, ధరలు పెంచుతున్నాయి. నిజానికి, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన ఆర్థిక విధానాలు బంగారం ధరలను ఎగదోయడానికి సాయపడ్డాయి. ట్రంప్, కార్పొరేట్ పన్నులలో కోతను ప్రతిపాదించారు. ఇది, అమెరికా రుణాన్ని & ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది.
భారత్, చైనా సహా ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు (దిగుమతి సుంకాలు) విధిస్తామని ట్రంప్ బెదిరించారు. ఇది, ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచింది. డొనాల్డ్ ట్రంప్, అమెరికాలో ఆదాయ పన్నును తొలగించడం & పాత పన్ను నిర్మాణాన్ని తిరిగి ప్రవేశపెట్టడం గురించి మాట్లాడారు. ఇదే జరిగితే గోల్డ్ రేట్లు ఇంకా బలపడే అవకాశం ఉంది.
భారీగా బంగారం కొంటున్న కేంద్ర బ్యాంక్‌లు
ఇది కాకుండా, భారతదేశం & ఆసియా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలులో ముందంజలో ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది, కేంద్ర బ్యాంకులు వరుసగా మూడో ఏడాది కూడా 1,000 టన్నులకు పైగా పసిడి కొన్నాయి. 2024లో, భారతదేశం 73 టన్నుల బంగారం కొనుగోలు చేసింది, దీంతో దేశంలో మొత్తం బంగారు నిల్వలు (Total gold reserves in India) 876 టన్నులకు చేరుకున్నాయి. ఇది కాకుండా, చైనా గత మూడు సంవత్సరాలలో 331 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది, తన మొత్తం నిల్వలను 2,279 టన్నులకు చేర్చింది.
మరో ఆసక్తికర కథనం: బ్రేకుల్లేని పసిడి బండి, మళ్లీ కొత్త రికార్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ