Sovereign Gold Bond Issue: బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం. ఈ నెల 18 నుంచి (సోమవారం) ప్రారంభమయ్యే సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయించింది. ఈ బాండ్ల ద్వారా బంగారం కొనుగోలు చేయడానికి పెట్టుబడిదార్లు ఒక్కో గ్రాముకు రూ. 6199 ‍‌(SGB Issue Price) పెట్టుబడి పెట్టాలి. ఒక బాండ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. ఎన్ని బాండ్లు కొంటే, అన్ని గ్రాముల బంగారం కొన్నట్లు లెక్క.


ఆన్‌లైన్‌లో గోల్డ్‌ బాండ్ల కొనుగోలుపై డిస్కౌంట్ (Discount on buying sovereign gold bonds online)
ఇది, సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్‌లో థర్డ్‌ ఇష్యూ (Sovereign Gold Bonds 2023-24 Series III). సోమవారం నుంచి ప్రారంభమయ్యే సబ్‌స్క్రిప్షన్‌, ఐదు రోజుల పాటు (శుక్రవారం, 22 డిసెంబర్‌ 2023) వరకు ఓపెన్‌లో ఉంటుంది. గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ. 50 డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఆన్‌లైన్ పేమెంట్ చేసే వారికి ఒక్కో బాండ్ రూ. 6,149 కే జారీ అవుతుంది. SGBలకు ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉండదు. ఎన్ని బాండ్ల కోసం అప్లై చేసుకుంటే అన్ని బాండ్లు దొరుకుతాయి.


బంగారం ధరలు పెరిగే అవకాశం
వచ్చే ఏడాది మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. కాబట్టి, ప్రస్తుత సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్‌కు మంచి డిమాండ్ కనిపించవచ్చని భావిస్తున్నారు.


ఆర్‌బీఐ నుంచి 66వ సావరిన్ గోల్డ్ బాండ్స్‌ జారీ ఇది. మొదటి ఇష్యూ 2015లో వచ్చింది, అది గత నెల నవంబర్ 30న మెచ్యూర్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో సిరీస్‌లకు ఇన్వెస్టర్ల నుంచి బలమైన స్పందన లభించడంతో పాటు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. సెప్టెంబరులో జారీ చేసిన రెండో సిరీస్‌లో, ప్రజలు 11.67 టన్నుల బంగారానికి సమానమైన బాండ్స్‌ను కొనుగోలు చేశారు. మొదటి సిరీస్‌లో 7.77 టన్నుల బంగారానికి సమానమైన సబ్‌స్క్రిప్షన్‌ లభించింది.


పన్ను మినహాయింపు (Tax Exemption)
బ్యాంక్ FD కంటే RBI సావరిన్ గోల్డ్ బాండ్ మెరుగైన రాబడి ఇస్తుందని చాలా సందర్భాల్లో రుజువైంది. ఇందులో పెట్టుబడిపై రాబడితో పాటు భద్రతకు కూడా గ్యారెంటీ ఉంటుంది. పెరుగుతున్న బంగారం ధర ప్రయోజనంతో పాటు, మొత్తం డబ్బుపై 2.5% వడ్డీని పెట్టుబడిదార్లు పొందుతారు. అంటే, పెరిగే ధర + వడ్డీ.. రెండు విధాలా ప్రయోజనం లభిస్తుంది. 


బాండ్ మెచ్యూరిటీ టైమ్‌ ఎనిమిదేళ్లు ఉంటుంది. మెచ్యూరిటీ వరకు బాండ్‌ని కంటిన్యూ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు.


ఎవరికి అవకాశం? (Who can invest?)
భారతీయ పౌరులంతా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనొచ్చు. ఒక వ్యక్తి, ఒక సంవత్సరంలో కనీసం 1 గ్రాము - గరిష్టంగా 4 కిలోల బంగారానికి సమానమైన బాండ్లను కొనొచ్చు. ట్రస్టులు, సంస్థలు ఒక సంవత్సరంలో 20 కిలోల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.


ఎక్కడ కొనొచ్చు? ‍‌(Where can I buy?)
పోస్టాఫీసులు, వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), NSE, BSE సహా గుర్తింపు పొందిన బ్రోకరేజ్‌లు, పేమెంట్‌ యాప్స్‌ ద్వారా బాండ్లను కొనుగోలు చేయవచ్చు. SGBలను కొనుగోలు చేయడానికి KYC అవసరం. పాన్ కార్డు కూడా తప్పనిసరి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి