Gold Karats: భారతదేశానికి, బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. మన దేశంలోని సర్వ మతాచారాల్లో బంగారం పాత్ర ఉంటుంది. పండుగలు, వివాహ వేడుకలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో బంగారాన్ని బహూకరించడం, ఆభరణాలు ధరించడం వంటివి ప్రజలు ఇష్టపడతారు. అయితే, మెరిసేదంతా బంగారం కాదు. చాలామందికి బంగారం నాణ్యత గురించి పూర్తి స్థాయి అవగాహన ఉండదు. 


బంగారం నాణ్యతను ఇలా కొలుస్తారు..
ఆభరణం తయారీ సమయంలో బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత సులువుగా వంగుతుంది. పూర్తి స్వచ్ఛమైన బంగారంతో చేసిన నగ చాలా త్వరగా సాగిపోతుంది, మన్నిక తగ్గుతుంది. కాబట్టి, పసిడి ఆభరణాలకు బలం చేకూర్చేందుకు, బంగారంతో పాటు ఇతర లోహాలను కూడా కలిపి నగలు తయారు చేస్తారు. ఇతర లోహాలను కలిపిన తర్వాత, ఆ ఆభరణంలో బంగారం పాళ్ల లేదా స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లుగా పసిడి నాణ్యతను లెక్కిస్తారు.


24 క్యారెట్ల బంగారం           
24 క్యారెట్లు అంటే సంపూర్ణ స్వచ్ఛమైన, ఇతర ఏ లోహం కలవని బంగారం అని అర్ధం. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛత 99.99 శాతం. ఈ నాణ్యత కారణంగా దీని ధర అత్యధికం. ఇది చాలా మృదువుగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారాన్ని నాణేలు, కడ్డీలు, బిస్క్‌ట్‌ల తయారీకి ఉపయోగిస్తారు. వైద్య చికిత్స పరికరాలు, ఎలక్ట్రానిక్ అనువర్తనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు.


22 క్యారెట్ల బంగారం              
22 క్యారెట్ల బంగారంలో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది, మిగిలిన 8.33 శాతం ఇతర లోహాల మిశ్రమం ఉంటుంది. ఈ మిశ్రమంలో సాధారణంగా వెండి, రాగిని ఉపయోగిస్తుంటారు. ఇది, 24 క్యారెట్ల కంటే తక్కువ స్వచ్ఛమైన బంగారం. 22 క్యారెట్ల బంగారంతో బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. ఈ రకమైన బంగారు ఆభరణాలను ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ధరిస్తారు. ఎందుకంటే ఈ లోహం చాలా మృదువైనది, బరువు తక్కువగా ఉంటుంది.


18 క్యారెట్ల బంగారం                         
18 క్యారెట్ల బంగారంలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 25 శాతంలో రాగి, వెండి కలుపుతారు. ఈ స్థాయిలో ఇతర లోహాలు కలపడం వల్ల 18 క్యారెట్ల బంగారం గట్టిదనం పెరుగుతుంది. అందువల్ల, రోజువారీ జీవితంలో ధరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ప్రధానంగా ఉంగరాలను ఈ తరహా మెటల్ నుంచి తయారు చేస్తారు.


14 క్యారెట్ల బంగారం             
14 క్యారెట్ల బంగారంలో ఇతర లోహాల కల్తీ ఎక్కువ. ఇందులో 58.3 శాతం మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 41.7 శాతం నికెల్, వెండి, జింక్ వంటి లోహాలను కలుపుతారు.


ఫలానా క్యారెట్‌ బంగారమే ఉత్తమం అని ఇక్కడ చెప్పడం లేదు. వివిధ క్యారెట్ల బంగారం ఇతర రకాల బంగారం కంటే భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రజలు ఎలాంటి ఆభరణాలను ధరించాలనుకుంటున్నారనేది వాళ్ల అవసరాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.