Post Office Monthly Income Scheme: ప్రతి నెలా ఠంచనుగా పేమెంట్‌ వచ్చే స్థిరమైన ఆదాయ మార్గం కోసం చూస్తున్నారా? పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (POMIS) మీ ఆలోచనకు సూటవుతుంది. ఇది, గవర్నమెంట్‌ సపోర్ట్‌తో నడిచే స్కీమ్‌ కాబట్టి దీనిలో పెట్టుబడి సురక్షితం &ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతం, ఈ స్కీమ్‌పై ఏడాదికి 7.40% వడ్డీని (Interest Rate) ప్రభుత్వం చెల్లిస్తోంది.


పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ కాల పరిమితి ‍‌(Tenure) ఐదు సంవత్సరాలు. ఈ స్కీమ్‌లో నెలవారీ ఆదాయాన్ని లెక్కించడానికి సూత్రం: "డిపాజిట్ మొత్తం x వడ్డీ రేటు/12".


మీ డిపాజిట్‌ రూ.5 లక్షలు అయితే నెలవారీ ఆదాయం రూ. 3,083.33
రూ.9 లక్షల పెట్టుబడిపై నెలవారీ ఆదాయం రూ.5,550
15 లక్షలు డిపాజిట్ చేస్తే మంత్లీ ఇన్‌కమ్‌ రూ.9,250


పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను ఎవరు తెరవగలరు? (Who Is Eligible?)


పెద్దవాళ్లు (adult) సింగిల్‌ అకౌంట్‌ తీయవచ్చు.
ఇద్దరు లేదా ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా కూడా తీసుకోవచ్చు.
మైనర్/ మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపున సంరక్షకుడు.
10 సంవత్సరాల వయస్సు పైబడిన మైనర్‌ కూడా తన పేరిట ఖాతా ప్రారంభించొచ్చు.
.
డిపాజిట్ (Minimum & Maximum Deposit)


కనిష్ట మొత్తం 1000 రూపాయలు.
సింగిల్‌ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 9 లక్షలు - జాయింట్‌ ఖాతాలో 15 లక్షలు జమ చేయవచ్చు.
ఉమ్మడి ఖాతా పెట్టుబడిలో ఖాతాదార్లందరికీ సమాన వాటా ఉంటుంది.
ఒక వ్యక్తి పేరిట ఎన్ని MIS ఖాతాలైనా తీయొచ్చు. అన్ని ఖాతాల్లో కలిపి డిపాజిట్‌/షేర్‌ రూ. 9 లక్షలకు మించకూడదు.
సంరక్షకుడిగా మైనర్ తరపున తీసిన ఖాతాలో పరిమితి వేరుగా ఉంటుంది.


వడ్డీ చెల్లింపు ‍‌(Payment of Interest)


ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన నాటి నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లిస్తారు
ప్రతి నెలా చెల్లించవలసిన వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేయకపోతే, ఆ వడ్డీపై చక్రవడ్డీ రాదు
ఒక డిపాజిటర్ రూ.9 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే, అదనపు డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి వాపసు చేసే తేదీ వరకు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును దీనిపై చెల్లిస్తారు.
వడ్డీని అదే పోస్టాఫీసు లేదా ECSలో ఉన్న పొదుపు ఖాతాలోకి ఆటో క్రెడిట్ చేసుకోవచ్చు. 
డిపాజిటర్ తీసుకున్న వడ్డీకి ఆదాయ పన్ను చెల్లించాలి.


ముందస్తు మూసివేత (Premature closure of account)


డిపాజిట్ తేదీ నుంచి 1 సంవత్సరం లోపు ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేయలేరు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత & 3 సంవత్సరాల లోపు ఖాతా మూసేస్తే, ప్రిన్సిపల్ డిపాజిట్‌ నుంచి 2% కట్‌ చేసి, మిగిలిన డబ్బు తిరిగి ఇస్తారు.
ఖాతా తెరిచిన తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత & 5 సంవత్సరాల లోపు అకౌంట్‌ క్లోజ్‌ చేస్తే, అసలు మొత్తం నుంచి 1% సొమ్ము మినహాయించుకుని మిగిలిన డబ్బు చెల్లిస్తారు.
పోస్టాఫీస్‌కు వెళ్లి సంబంధిత ఫారాన్ని నింపి సబ్మిట్‌ చేస్తే మీ ఖాతాను క్లోజ్‌ చేస్తారు.


మెచ్యూరిటీ అమౌంట్‌ (Maturity)


ఐదు సంవత్సరాల గడువు తర్వాత ఖాతా కాలపరిమితి ముగుస్తుంది. మీ పాస్‌బుక్‌ను సంబంధిత పోస్టాఫీసులో ఇస్తే మీ డబ్బు మీకు తిరిగి ఇస్తారు.
ఖాతాదారు అకౌంట్‌ మెచ్యూరిటీకి ముందే మరణిస్తే, ఖాతాను క్లోజ్‌ చేయొచ్చు. నామినీ/చట్టపరమైన వారసులకు ఆ అకౌంట్‌లోని డబ్బు చెల్లిస్తారు. రిఫండ్‌ ఇచ్చే ముందు నెల వరకు వడ్డీని కూడా చెల్లిస్తారు.


మరో ఆసక్తిర కథనం: ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టడంలో వీళ్లు తోపులు - ఖజానాలో పెద్ద షేర్‌ వాళ్లదే