5 Major Changes From February 01, 2025: పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (జనవరి 31, 2025) నుంచి ప్రారంభమయ్యాయి. రేపు, ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) దేశ సాధారణ బడ్జెట్ (Budget 2025) సమర్పిస్తారు.
కొత్త నెల (ఫిబ్రవరి) ప్రారంభంలో, కేంద్ర బడ్జెట్‌తో పాటు కొన్ని కొత్త ఆర్థిక మార్పులు కూడా జరుగుతాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల జేబులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి 2025 నుంచి, LPG గ్యాస్ సిలిండర్ల ధరల నుంచి UPI సంబంధిత నియమాల వరకు ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి.
ఫిబ్రవరి 2025 నుంచి దేశవ్యాప్తంగా కనిపించనున్న మార్పులు:
LPG ధరలలో మార్పులు
ప్రతి నెల మొదటి తేదీన, దేశవ్యాప్తంగా LPG ధరల్లో మార్పులు వస్తాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) LPG సిలిండర్ల ధరలను అప్‌డేట్ చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా, మన దేశంలో గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించువచ్చు లేదా పెంచవచ్చు. కొత్త ధరలు ఆ నెల మొత్తం అమల్లో ఉంటాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల జేబులను నేరుగా ప్రభావితం చేస్తాయి. జనవరి 01న, చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి.
UPI సంబంధిత మార్పులు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కు సంబంధించి, ఫిబ్రవరి 01వ తేదీ నుంచి కొత్త రూల్ అమల్లోకి రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), కొన్ని UPI లావాదేవీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒక సర్క్యులర్‌ను ఇప్పటికే జారీ చేసింది. కొత్త నియమం ప్రకారం, ఫిబ్రవరి ప్రారంభం నుంచి, స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన UPI ట్రాన్జాక్షన్ IDలతో లావాదేవీలు చేయడం వీలుకాదు. NPCI ప్రకారం, UPI ట్రాన్జాక్షన్ IDలో ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలు (ఆంగ్ల అక్షరాలు & అంకెలు) మాత్రమే ఉండాలి. @, #, *, &వంటి స్పెషల్ క్యారెక్టర్లతో కూడిన UPI ట్రాన్జాక్షన్ ID నుంచి చేసే చెల్లింపు ఆటోమేటిక్‌గా ఫెయిల్ అవుతుంది. దీనిపై పూర్తి వార్తను ఈ కింది లింక్ ద్వారా చదవండి.
మరో ఆసక్తికర కథనం: UPI లావాదేవీలు ఫిబ్రవరి 01 నుంచి బంద్ - మీ పేమెంట్ ఫెయిల్ కావచ్చు!
మారుతి కార్లు మరింత ఖరీదు
దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL), ఫిబ్రవరి 01 నుంచి, తన కార్ ధరలు పెంచుతోంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకుని, వివిధ కార్ మోడళ్ల ధరలను రూ. 32,500 వరకు పెంచుతున్నట్లు మారుతి ప్రకటించింది. ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా, ఈకో, ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్ 6, ఫ్రాంక్స్, ఇన్విక్టో, జిమ్నీ. గ్రాండ్ విటారా కార్ మోడళ్ల రేట్లు పెరుగుతాయి.
బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పు
కోటక్ మహీంద్ర బ్యాంక్, తన సర్వీసులు & ఛార్జీలను మారుస్తోంది. దీనిపై ఇప్పటికే తన కస్టమర్లకు సమాచారం పంపింది. కొత్త ఛార్జీలు ఫిబ్రవరి 01, 2025 నుంచి అమలులోకి వస్తాయి. వీటిలో.. ఉచిత ATM లావాదేవీ పరిమితి సహా వివిధ బ్యాంకింగ్ సేవలపై కొత్త రుసుములు ఉన్నాయి.
విమాన ప్రయాణాలు
ఫిబ్రవరి 01 నుంచి, విమాన ఇంధనమైన 'ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్' (ATF) ధరలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన విమాన ఇంధన ధరలను సవరిస్తాయి. కాబట్టి, ఫిబ్రవరి 01న ATF రేట్లు మారితే, ఆ ప్రభావం డైరెక్ట్‌గా విమాన ప్రయాణికులపై పడుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఒక్కరోజులో రూ.13,100 పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ