సాధారణ వినియోగదారుడిపై ధరాభారం మరింత పెరగనుంది. రోజువారీ వినియోగ వస్తువుల ధరలు ఇంకా ప్రియం అవుతున్నాయి. దేశంలోని అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో ఒకటైనా హిందుస్థాన్‌ యునీలివర్‌ కొన్ని ఉత్పత్తుల ధరలను 15 శాతం వరకు పెంచబోతోందని సీఎన్‌బీసీ టీవీ-18 రిపోర్ట్‌ చేసింది.


పియర్స్‌ 125 గ్రాముల సబ్బు ధర 2.4 శాతం పెరుగనుంది. పియర్స్‌ మల్టీప్యాక్‌ ధర 3.7 శాతం వరకు పెంచుతారని తెలిసింది. ఇక లక్స్‌ సబ్బు రేటు మల్టీ ప్యాక్‌ వేరియెంట్లను బట్టి 9 శాతం వరకు పెరగనుంది. సన్‌సిల్క్‌ షాంపూ ధరలను రకాలను బట్టి రూ.8 నుంచి 10 వరకు పెంచనున్నారు. క్లినిక్‌ ప్లస్‌ 100 ఎంఎల్‌ షాంపూ ధర ఏకంగా 15 శాతం పెరగబోతోంది.


యువతులు ఎక్కువగా వాడే గ్లో అండ్‌ లవ్లీ ధర 6-8 శాతం వరకు పెంచుతారు. పాండ్స్‌ టాల్కమ్‌ పౌడర్‌ 5-7 శాతం వరకు పెరుగుతుంది. ఏప్రిల్‌లోనే హిందుస్థాన్‌ యునీలివర్‌ చాలా వరకు ధరలు పెంచింది. స్కిన్‌ క్లీన్సింగ్‌ నుంచి డిటర్జెంట్ల ఉత్పత్తుల ధరను 3-20 శాతం వరకు పెంచారు.


కంపెనీలో చేరాక గత 30 ఏళ్లలో ఇలాంటి ద్రవ్యోల్బణం తరహా పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని హెచ్‌యూఎల్‌ సీఈవో, ఎండీ సంజీవ్‌ మెహతా మే 2న అన్నారు. సమీప భవిష్యత్తులో పరిస్థితులు మరింత కఠినంగా ఉండబోతున్నాయని అంచనా వేశారు. ఏదేమైనా ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు భారత్‌ గొప్ప మార్కెట్‌గా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.


ద్రవ్యోల్బణం నుంచి ఎకానమీని రక్షించేందుకు ఆర్బీఐ చర్యలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ శక్తికాంత దాస్‌ రెపో రేటును పెంచారు. ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును ఆర్బీఐ 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఈ క్షణం నుంచే రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (SDF) రేటు 4.15 శాతం, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిటిలీ రేట్‌ (MSDF), బ్యాంకు రేటు 4.56 శాతంగా ఉన్నాయి. క్యాష్ రిజర్వు రేషియో (CRR)ను ఆర్బీఐ 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.5 శాతానికి చేర్చింది. 2018, ఆగస్టు 1 తర్వాత వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి.


వృద్ధికి ఊతమిస్తూ, ద్రవ్యోల్బణాన్ని టార్గెట్‌ రేంజులోనే ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ శక్తికాంత దాస్‌ (Shaktikanta das) తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 40 ఏళ్ల గరిష్ఠమైన 8.5 శాతానికి చేరుకుంది. దాంతో యూఎస్‌ ఫెడ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచింది. భారత్‌లోనూ సీపీఐ ప్రకారం ఇన్‌ఫ్లేషన్‌ 6.95 శాతానికి పెరగడంతో వడ్డీరేట్లను సవరించారు. దీని వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దారులకు కొంత మేలు జరగనుంది.