Financial Products: బ్యాంక్‌ ఇచ్చే అప్పుల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే వ్యక్తిగత రుణం (Personal Loan) మాత్రమే కాకుండా, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చగల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, ఫ్లెక్సీ లోన్ వంటి ఆర్థిక ఉత్పత్తులను కూడా బ్యాంక్‌ అందుబాటులో ఉంచుతుంది. వీటి మధ్య తేడాలను మీరు అర్ధం చేసుకుంటే, మీ అవసరానికి ఏది బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుందో తెలుసుకోవచ్చు.


ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ
మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బు లేనప్పుడు కూడా/ మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను మించి విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంక్‌ కల్పించిన సదుపాయమే ఓవర్‌డ్రాఫ్ట్. బ్యాంక్ మీ కోసం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని సెట్ చేస్తుంది, నిర్ణీత పరిమితి వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌ చేసిన మొత్తానికి బ్యాంక్ వడ్డీని వసూలు చేస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్‌లో, మీకు కావలసినప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని బ్యాంక్ మీకు అందిస్తుంది. అంతేకాదు, మీ సౌలభ్యం ప్రకారం తిరిగి చెల్లించవచ్చు. బ్యాంక్ సెట్ చేసిన ప్రీ-అప్రూవ్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో ఉంటూనే మీరు బ్యాంక్ నుంచి డబ్బు పొందవచ్చు. ఇది, మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన క్రెడిట్ ఫెసిలిటీ.


డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ
దీనిలో, ప్రారంభంలో నిర్ణయించిన మొత్తం క్రెడిట్ పరిమితి ప్రతి నెలా క్రమంగా తగ్గుతుంది. నిర్ణీత కాలం తర్వాత ఈ క్రెడిట్ పరిమితి సున్నా అవుతుంది. మీరు డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం పొందిన బ్యాంక్ లేదా NBFC పాలసీ ప్రకారం... నెలవారీగా, త్రైమాసికంలో, ఆరు నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన క్రెడిట్‌ పరిమితి తగ్గుతుంది. ఉదాహరణకు.. మీరు యాన్యువల్‌ డ్రాప్‌లైన్ ప్లాన్ కింద 3 సంవత్సరాల కాల వ్యవధితో రూ.6 లక్షల ప్రారంభ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని తీసుకున్నారని అనుకుందాం. మీరు ఈ 6 లక్షల రూపాయలను ఏడాది ముగిసేలోపు ఒకేసారి లేదా వివిధ వాయిదాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు. డ్రాప్‌లైన్ ఓవర్‌డ్రాఫ్ట్ ప్లాన్‌లో, క్రెడిట్ పరిమితి మొదటి సంవత్సరం తర్వాత రూ.4 లక్షలకు, 2 సంవత్సరాల తర్వాత రూ.2 లక్షలకు తగ్గుతుంది. 3 సంవత్సరాల తర్వాత సున్నా అవుతుంది. టర్మ్ లోన్+ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయానికి మిశ్రమ ప్లాన్‌గా దీనిని చూడొచ్చు.


పర్సనల్ లోన్
పర్సనల్ లోన్ అనేది ఒక రకమైన టర్మ్ లోన్. దీనిని EMIల రూపంలో తిరిగి చెల్లించాలి. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు ఏకమొత్తాన్ని జారీ చేస్తాయి. రుణగ్రహీత ఆ డబ్బును ముందస్తుగా పొంది, తర్వాతి నెల నుంచి సమాన వాయిదాల్లో తిరిగి చెల్లిస్తాడు.


ఫ్లెక్సీ లోన్
దీనిని ఒకరకమైన వ్యక్తిగత రుణంగా, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయంగానూ చూడొచ్చు. దీనిలో, NBFC లేదా బ్యాంక్ తన కస్టమర్‌కు ముందస్తుగా ఆమోదించిన రుణాన్ని (Pre-Approved Loan) అతని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. కస్టమర్‌కు అవసరమైతే దానిని ఉపయోగించుకోవచ్చు. కస్టమర్‌ తన సౌలభ్యం మేరకు ఈ లోన్‌ను ముందస్తుగా కూడా చెల్లించొచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఫ్లెక్సీ లోన్ అకౌంట్‌ నుంచి విత్‌డ్రా చేయబడిన మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తానికి వడ్డీ ఉండదు.


ఫ్లెక్సీ లోన్ - ఓవర్‌డ్రాఫ్ట్ - పర్సనల్ లోన్‌లో ఏది బెస్ట్‌?
ఫ్లెక్సీ లోన్ తక్కువ వడ్డీ రేటుతో వస్తుంది, సులభంగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును విత్‌డ్రా చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఫిక్స్‌డ్ ప్రీ-పేమెంట్ ఆప్షన్‌తో వస్తుంది కాబట్టి, తిరిగి చెల్లించేందుకు సమీప భవిష్యత్తులో డబ్బు దొరకదు అన్నవాళ్లు దీనిని ఎంచుకోవచ్చు. అడపాదడపా క్యాష్‌ ఫ్లో అవకాశం ఉన్న వాళ్లకు ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం మంచిది. వాళ్లు కోరుకున్నప్పుడు క్రెడిట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. వైద్య ఖర్చులు, ప్రయాణం వంటి నిర్దిష్ట అవసరాల కోసం మాత్రమే వ్యక్తిగత రుణాన్ని తీసుకోవాలి. దీనిని లాస్ట్‌ ఆఫ్షన్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే, మిగిలిన వాటితో పోలిస్తే దీనిలో వడ్డీ రేట్లు ఎక్కువ.


మరో ఆసక్తికర కథనం: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!