Highest Interest Rates On 3 Year Fixed Deposits: ప్రస్తుతం, మన దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది చివరిలో రెపో రేటును (Repo Rate) తగ్గించవచ్చని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి. మీ దగ్గర డబ్బులు ఉంటే, ఎఫ్‌డీ వేయడానికి ఇదే ఉత్తమమైన సమయమని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 


రెపో రేట్‌ తగ్గకముందే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే అధిక వడ్డీ రేటు ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు & ఎక్కువ వడ్డీ డబ్బును పొందొచ్చు. సాధారణంగా, డిపాజిట్ కాల పరిమితి పెరిగే కొద్దీ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. దీని అర్థం... ఎక్కువ కాలానికి ఎక్కువ వడ్డీ రేటు - తక్కువ కాల వ్యవధికి తక్కువ వడ్డీ రేటు. అయితే, కొన్ని బ్యాంక్‌లు మూడేళ్ల కాల వ్యవధిలో ఎక్కువ వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. 


అన్ని బ్యాంక్‌లు సాధారణ పౌరుల కంటే సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.50 శాతం ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. 60 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఉన్న వ్యక్తిని సాధారణ కస్టమర్‌ అని, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్‌ను సీనియర్‌ సిటిజన్‌ కస్టమర్‌ అని బ్యాంక్‌లు వ్యవహరిస్తుంటాయి.


3 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గరిష్ట వడ్డీని అందిస్తున్న బ్యాంక్‌లు:


ఈ లిస్ట్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ‍‌(Punjab National Bank) అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్‌, 3 సంవత్సరాల డిపాజిట్లపై మీద సాధారణ డిపాజిటర్లకు 7.25 శాతం వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది.


లిస్ట్‌లో సెకండ్‌ ప్లేస్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ది (HDFC Bank). ఈ బ్యాంక్‌, 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7 శాతం వడ్డీ ఆదాయాన్ని & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది.


ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కూడా 3 సంవత్సరాల డిపాజిట్లపై సంవత్సరానికి 7 శాతం వడ్డీని పే చేస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు, అంటే  7.50 శాతం ఇస్తోంది.


బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) విషయానికి వస్తే... 3 సంవత్సరాల ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లకు సంవత్సరానికి 6.75 శాతం & మరియు సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), అదే కాలానికి సాధారణ పౌరులకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రాబడిని ఆఫర్‌ చేస్తోంది. 


కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) కూడా 3 సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ వ్యక్తులకు 7 శాతం & సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.


FD రేట్లు పెంచిన ప్రైవేట్‌ బ్యాంక్‌లు


ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లను ఇటీవల సవరించాయి. ICICI బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ఈ నెల 02వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ బ్యాంక్‌ నూతన FD రేట్లు ‍‌(అన్ని కాల వ్యవధులకు కలిపి) సాధారణ పౌరులకు 3 నుంచి 7.20 శాతం మధ్య & సీనియర్ సిటిజన్‌లకు 3.50 శాతం నుంచి 7.75 శాతం మధ్య ఉంటాయి.


యాక్సిస్ బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లను ఈ నెల 01 నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని కాల వ్యవధులకు కలిపి, కొత్త వడ్డీ రేట్లు సాధారణ పౌరులకు 3 శాతం నుంచి 7.20 శాతం మధ్య ఉన్నాయి. అవే టెన్యూర్స్‌లో, సీనియర్ సిటిజన్లు 3.50 శాతం నుంచి 7.75 శాతం మధ్య వడ్డీ ఆదాయం సంపాదించొచ్చు.


మరో ఆసక్తికర కథనం: ప్రతి నెలా రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవాలంటే NPSలో ఎంత పెట్టుబడి పెట్టాలి?