Fixed Deposits Flood: బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల వరద ప్రవహిస్తోంది. వద్దంటే డబ్బు వచ్చి చేరుతోంది. కేవలం 15 రోజుల్లోనే రూ. 4 లక్షల కోట్లకు పైగా క్యాష్ డిపాజిట్లు బ్యాంకుల్లోకి వచ్చాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు కారణంగా, టర్మ్ డిపాజిట్ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో, ఆ మార్గంలో పెట్టుబడులు పెరిగాయి.
గత సంవత్సరం నవంబర్ నెలలో... ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు & CEOలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సమీక్ష జరిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్ల గురించి ఆ సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. దేశంలో రుణ డిమాండ్‌తో పోలిస్తే డిపాజిట్ వృద్ధి క్షీణించడంపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఆందోళన వ్యక్తం చేశారు. రుణ డిమాండ్‌కు అనుగుణంగా నగదు లభ్యత ఉండేలా చూసుకోవాలని, డిపాజిట్ల సేకరణ పెంచాలని ఆయన సూచించారు. గవర్నర్ సూచనకు అనుగుణంగా, బ్యాంకులు తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం చూపడం ప్రారంభించింది, డిపాజిట్లలో క్రమంగా వృద్ధి కనిపించింది. ప్రస్తుతం వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడుల పట్ల జనం ఆకర్షితులవుతున్నారు. ఈ విధంగా, కేవలం 15 రోజుల్లోనే రూ. 4 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ల సేకరించి, బ్యాంకులు విజయం సాధించాయి.
9 - 9.50 శాతం వరకు వడ్డీ
గత కొన్ని నెలలుగా బ్యాంకుల క్రెడిట్ & డిపాజిట్ల మధ్య అంతరం పెరుగుతోంది. రుణాల కోసం ఉన్నంత డిమాండ్ బ్యాంక్ డిపాజిట్ల మీద లేదన్న లెక్కలు వెలువడ్డాయి. ఇది ఇలాగే కొనసాగితే, రుణాలు ఇవ్వడానికి బ్యాంకుల వద్ద నగదు లేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. RBI రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను అదే వేగంతో పెంచకపోవడం వల్ల కూడా ఈ కొరత ఏర్పడింది. శక్తికాంత దాస్ సమీక్ష తర్వాత, 2023లో, బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు, దీర్ఘకాలిక టర్మ్ డిపాజిట్లపై 8 శాతం నుంచి 8.50 శాతం వరకు వడ్డీ రేట్లను బ్యాంకులు అందిస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 9 నుంచి 9.50 శాతం వరకు అందిస్తున్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, రెపో రేటును 4 శాతం నుంచి 6.50 శాతానికి రిజర్వ్ బ్యాంక్ పెంచింది. బ్యాంకులు అదే స్థాయిలో రేట్లను పెంచకపోవడంతో, పెట్టుబడిదార్లు తమ డబ్బును మంచి రాబడి కోసం మ్యూచువల్ ఫండ్లలోకి మళ్లించారు. పోస్టాఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు కూడా మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తుండడంతో అటువైపు మరికొన్ని పెట్టుబడులు వెళ్లాయి. దీంతో, గత కొన్ని నెలల్లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 69 శాతంగా ఉంది. వడ్డీ రేట్ల తీరు మారిన తర్వాత, ఇప్పుడు ఆ నిష్పత్తి 75 శాతానికి చేరింది.
ఈ ఏడాది తొలి పక్షం రోజుల్లో బ్యాంకులు సేకరించిన డిపాజిట్లు రూ. 184.5 లక్షల కోట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10.2 శాతం ఎక్కువ. ఇదే కాలంలో, 15.7 శాతం వృద్ధితో రూ. 138.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయి.
రేట్ల తీరు మార్చిన రెండు ప్రకటనలు
భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2023-24 బడ్జెట్‌లో, 'మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్' పేరుతో మహిళల కోసం ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించారు. రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ పథకం డిపాజిట్లపై 7.5 శాతం వార్షిక వడ్డీని ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల డిపాజిట్ పథకంలోనూ పెట్టుబడి పరిమితిని రెట్టింపు చేసి రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. ఇందులో సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 8% వడ్డీ లభిస్తుంది. ఈ రెండు ప్రకటనల తర్వాత, మిగిలిన డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లను కూడా ఆకర్షణీయంగా మార్చాలని బ్యాంకులపై ఒత్తిడి పెరిగింది.