Fixed Deposit Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) రెపో రేటును ఆరు సార్లు పెంచింది. తాజాగా, ఈ నెలలోని 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్ల పెంచింది. ఈ పెంపు తర్వాత మొత్తం రెపో రేటును (RBI Repo Rate Hike) 6.5 శాతానికి చేరింది. దీని వల్ల బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలు, స్వీకరించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచాయి.
ప్రస్తుతం, కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద భారీ వడ్డీని అందిస్తున్నాయి. మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, ఈ 4 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లను ఒకసారి చూడండి. మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయండి.
ఈ 4 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సాధారణ పౌరుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు, వివిధ ఆఫర్ల కింద అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. సీనియర్ సిటిజన్ల FDల (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) మీద 9.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank)
7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల పరిమితితో చేసే డిపాజిట్ల మీద ఈ బ్యాంక్ సాధారణ ఖాతాదార్లకు 4 శాతం నుంచి 6 శాతం వడ్డీని ఇస్తోంది. ఇదే కాల వ్యవధుల్లో సీనియర్ సిటిజన్లకు (Senior Citizen FD Rates) 4.50 శాతం నుంచి 6.50 శాతం వడ్డీని ఇస్తోంది. స్పెషల్ FD స్కీమ్ కింద... 2 సంవత్సరాల నుంచి 998 రోజులు & 999 రోజుల ఫిక్స్‌డ్ జిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 7.51 శాతం & 8.51 శాతం వడ్డీని ఇస్తోంది. ఇదే కాల పరిమితి డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్లకు 8.01 శాతం & 8.76 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank)
ఈ బ్యాంక్, తన ఖాతాదార్ల కోసం మూడు ప్రత్యేక FD ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్‌ల కింద... 181 నుంచి 201 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 8.75 శాతం & సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం వడ్డీ ఇస్తోంది. అదేవిధంగా, 501 రోజులు & 1001 రోజుల కాల వ్యవధి డిపాజిట్ల మీద సాధారణ ప్రజలకు 8.75 శాతం & 9 శాతం వడ్డీని ఇస్తోంది. ఇవే కాల పరిమితి డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్లకు 9.25 శాతం & 9.5 శాతం వడ్డీని ఇస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank)
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 2 నుంచి 3 సంవత్సరాల మధ్య కాల వ్యవధి డిపాజిట్ల మీద 8.10 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 8.80 శాతం వడ్డీ ఇస్తోంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (North East Small Finance Bank)
ఈ బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కింద, 1111 రోజుల FDల మీద సీనియర్ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీ ఇస్తుండగా, ఇదే కాల పరిమితికి సాధారణ కస్టమర్లకు 8.00 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.