Fixed Deposit: కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్ అస్థిరతతో పాటు బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా దేశంలోని చాలామంది ప్రజలు తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులుగా మారుస్తున్నారు. ఈ తరహా పెట్టుబడుల కోసం బ్యాంకులు లేదా పోస్టాఫీసులను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో (FDలు) జమ చేసే పెట్టుబడికి భద్రతతో పాటు మంచి వడ్డీ ఆదాయం కూడా వస్తుంది. అయితే, అన్ని FDలు ఒకేలా ఉండవు, కొన్ని భేదాలు ఉంటాయి.


మీ డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ (Post Office Fixed Deposit) ఒక సురక్షితమైన ఎంపిక. పోస్టాఫీసు పథకాలు చాలా బ్యాంక్ FDల కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. గత ఏడాది మే నెల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును పెంచడం ప్రారంభించడంతో, అన్ని బ్యాంకులు కూడా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. పస్తుతం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద చాలా బ్యాంకులు 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తున్నాయి. 


దేశంలో అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (SBI Fixed Deposit) ఇప్పుడు 3 నుంచి 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ చిన్న మొత్తాల పొదుపు పథకాలు దీని కంటే పెద్దగా వెనుకబడి లేవు. మీ డబ్బును ఎస్‌బీఐలోకి తీసుకెళ్లాలా, పోస్టాఫీసుకు తీసుకెళ్లాలా అన్న గందరగోళంలో ఉంటే.. ముందు ఈ విషయాలను అర్ధం చేసుకోండి.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కాల పరిమితి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టర్మ్ డిపాజిట్ కాల గడువు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. పోస్టాఫీసు పథకాలు 1, 2, 3, 5 సంవత్సరాల కాలానికి మాత్రమే పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి.


వడ్డీ ఆదాయం
సాధారణ ప్రజల విషయంలో, రూ. 2 కోట్ల కంటే తక్కువున్న రిటైల్ డిపాజిట్ల మీద 3 నుంచి 7 శాతం మధ్య రాబడిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. ఇవే కాల వ్యవధుల్లో సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంక్ ప్రత్యేక పథకం అమృత్ కలశ్‌ కింద, పెట్టుబడిదార్లు 7.6 శాతం వరకు రాబడి పొందవచ్చు. అయితే అమృత్ కలశ్‌ స్కీమ్‌ వ్యవధి 400 రోజులు.


పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ల మీద వడ్డీ 6.8 నుంచి 7.5 శాతం మధ్య ఉంటుంది. వడ్డీని ఏటా జమ చేస్తారు. సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక రేట్లు లేవు.


పన్ను ప్రయోజనాలు
స్టేట్‌ బ్యాంక్‌, పోస్ట్ ఆఫీస్ రెండూ ఆదాయపు పన్ను చట్టం కింద కస్టమర్లకు పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి.


కాల పరిమితికి ముందే ఉపసంహరణ
పోస్టాఫీసులో, కాల పరిమితికి (మెచ్యూరిటీ) ముందే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి మెచ్యూరిటీకి ఆరు నెలల ముందే FD విత్‌డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసిన ఆరు నెలల తర్వాత - ఒక సంవత్సరం లోపు ఖాతాను మూసివేస్తే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటును ఆ డిపాజిట్‌కు వర్తింపజేస్తారు.


SBI FDని కూడా ముందుగానే ఉపసంహరించుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను మీరు కొనసాగించిన కాలాన్ని బట్టి కొంత జరిమానాను బ్యాంక్‌ విధిస్తుంది.


SBI FD- పోస్ట్ ఆఫీస్ FDలో ఏది ఎంచుకోవాలి?
ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు రెండూ ప్రభుత్వంతో లింక్ అయిన పథకాలు, రెండూ స్థిరమైన రాబడిని అందిస్తాయి. మీరు స్వల్పకాలిక డిపాజిట్‌ను ఎంచుకోవాలనుకుంటే SBI ఒక మంచి ఎంపిక. దీర్ఘకాలిక FD కోసం చూస్తున్నట్లయితే, ఒకే కాలానికి రెండు సంస్థల్లో ఇస్తున్న రాబడి రేటును బట్టి నిర్ణయం తీసుకోవచ్చు.