Fixed Deposit Rates Hike: 2022లో ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల వెన్ను విరిచింది. అధిక ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) 2022 సంవత్సరంలో తన రెపో రేటును ఐదు సార్లు పెంచింది. రెపో రేటు 4.00 శాతం నుంచి 6.25 శాతానికి తీసుకెళ్లింది. అదే సమయంలో, రుణ వృద్ధి కూడా పెరగడంతో నగదు సేకరణకు బ్యాంక్‌లు నడుం బిగించాయి. అన్ని కాలావధుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచి, ప్రజల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. 


ఇదే దారిలో, దేశంలో పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా టర్మ్‌ డిపాజిట్ల మీద తాము ఆఫర్‌ చేసే వడ్డీ రేట్లను పెంచాయి. ఖాతాదార్లు మరింత ఎక్కువ ఆదాయం ఆర్జించే వీలు కల్పించాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న, అన్ని కాలావధుల FDల మీద వడ్డీ రేటును పెంచాలని ఈ రెండు బ్యాంక్‌లు నిర్ణయించాయి. 


యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)
వడ్డీ రేటు పెంపు తర్వాత, ఈ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDల మీద 3.5% నుంచి 7.00% వరకు వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే.. ఇవే కాలావధుల్లో 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరులకు 2 సంవత్సరాల నుంచి 30 నెలల వరకు ఉన్న FDల మీద గరిష్టంగా 7.26 శాతం, ఇదే కాలాలకు సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.01 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. కొత్త రేట్లు జనవరి 10, 2023 నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ కాలావధుల్లో, సాధారణ పౌరులకు యాక్సిస్‌ బ్యాంక్‌ అందించే వడ్డీ రేటు వివరాలు ఇవి:


7 నుంచి 45 రోజుల FD – 3.50%
46 నుంచి 60 రోజుల FD - 4.00 శాతం
61 నుంచి 3 నెలల వరకు FD - 4.50 శాతం
3 నెలల నుంచి 6 నెలల వరకు FD - 4.75 శాతం
6 నెలల నుంచి 9 నెలల వరకు FD - 5.75%
9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు FD - 6.00 శాతం
1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 25 రోజుల FD – 6.75%
1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల వరకు FD – 7.10 శాతం
13 నెలల నుంచి 18 నెలల వరకు FD - 6.75 శాతం
2 సంవత్సరాల నుంచి 30 నెలల వరకు FD - 7.26 శాతం
30 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు FD - 7.00 శాతం


బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India)
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన ప్రత్యేక కాల FDల మీద వడ్డీ రేటును (Bank of India FD Rates) పెంచాలని నిర్ణయించింది. కొత్త రేట్లు జనవరి 10, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ ఇప్పుడు 444 రోజుల FD మీద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 2 నుంచి 5 సంవత్సరాల FDల మీద 7.55 శాతం వడ్డీని చెల్లిస్తోంది.