Financial Goals: భారీ సంపదను సృష్టించాలంటే భారీ పెట్టుబడులు కావాలన్నది కేవలం అపోహ మాత్రమే. రకరకాల మాటలతో భయపెట్టి, పెట్టుబడిదార్లను నిరుత్సాహపరిచే జనం మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. బ్యాంకు డిపాజిట్లలో ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టడం లేదా అధిక ప్రీమియంతో సంప్రదాయ జీవిత బీమా పథకాలను కొనుగోలు చేయడం వంటివి, అపార నిధి దగ్గరకు మిమ్మల్ని వెళ్లనీయకుండా తప్పు దారి పట్టించే మార్గాలు. 


సమర్థవంతమైన దీర్ఘకాలిక పెట్టుబడి కోసం కీలకమైన మూడు అంశాలపై దృష్టి పెట్టాలి. అవి... 1. త్వరగా పెట్టుబడి ప్రారంభించడం, 2. క్రమశిక్షణ 3. క్రమంగా పెంచుతూ వెళ్లడం. ఈ పద్ధతి ఫాలో అయితే, దీర్ఘకాలిక భారీ సంపదను సృష్టించడానికి భారీ పరిమాణంలో పెట్టుబడిపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. అత్యధిక రాబడి కోసం రిస్కీ అసెట్స్‌ను వెంటాడాల్సిన అవసరం కూడా రాదు. 


రూ.10 కోట్లు సృష్టించడానికి ఎంత సమయం పడుతుంది?


నెలకు రూ. 25,000 SIPని ఉదాహరణగా తీసుకుందాం. దానిపై సంవత్సరానికి 8 శాతం, 10 శాతం, 12 శాతం ఆదాయం వస్తుందని ఊహిద్దాం. సంప్రదాయ పెట్టుబడి మార్గాలు (ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలు వంటివి) ఏవీ కూడా 8 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించలేవన్న సంగతిని మనం గమనించాలి.


ఏటా 8 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ప్రతి నెలా స్థిరంగా రూ. 25,000 పెట్టుబడి పెడుతూ వెళితే, 10.4 కోట్లు కూడగట్టడానికి మీకు 42 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 1.2 కోట్లు.


ఏటా 10 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ప్రతి నెలా స్థిరంగా రూ. 25,000 పెట్టుబడి పెడుతూ వెళితే, 10.8 కోట్లు కూడగట్టడానికి మీకు 36 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 1.08 కోట్లు.


ఏటా 12 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ప్రతి నెలా స్థిరంగా రూ. 25,000 పెట్టుబడి పెడుతూ వెళితే, 9.97 కోట్లు కూడగట్టడానికి మీకు 31 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 0.93 కోట్లు.


ఏటా శాతం 10 పెట్టుబడి పెంచుకుంటూ వెళితే?


పై ఉదాహరణలను ఏటా 10 శాతం SIP టాప్‌-అప్‌తో కలిపి పరిశీలిద్దాం. ఈ ఉదాహరణలో.. మొదటి సంవత్సరంలో, ప్రతి నెలా మీరు రూ. 25,000 నెలవారీ SIPతో ప్రారంభిస్తారు. రెండో సంవత్సరంలో ఈ మొత్తాన్ని 10 శాతం పెంచి, నెలకు రూ. 27,500 కట్టుకుంటూ వెళ్తారు. మూడో సంవత్సరంలో దీనిని మరో 10 శాతం పెంచి, నెలకు రూ. 30,250 కడుతూ వెళ్తారు. ఇలా ఏటా 10% టాప్‌-అప్‌ చేస్తూ వెళితే.. రూ.10 కోట్లు పోగు చేయడానికి ఎంత కాలం పడుతుందో అర్ధం చేసుకుందాం.


ఏటా 8 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ఏటా 10% టాప్‌-అప్‌ చేస్తూ వెళితే, రూ.10.6 కోట్లు కూడగట్టడానికి మీకు 29 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 4.45 కోట్లు.


ఏటా 10 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ఏటా 10% టాప్‌-అప్‌ చేస్తూ వెళితే, రూ.10.8 కోట్లు కూడగట్టడానికి మీకు 27 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 3.63 కోట్లు.


ఏటా 12 శాతం రాబడిని ఇచ్చే SIP మార్గంలో, ఏటా 10% టాప్‌-అప్‌ చేస్తూ వెళితే, రూ.10.7 కోట్లు కూడగట్టడానికి మీకు 25 సంవత్సరాలు పడుతుంది. ఇదే కాలంలో మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 2.95 కోట్లు.


దీని ద్వారా మనం అర్ధం చేసుకునే మొదటి విషయం... పెద్ద సంపద సృష్టికి భారీ పెట్టుబడులు అవసరం లేదు. చిన్న మొత్తాలతోనే ప్రయాణం ప్రారంభించవచ్చు. మీరు ప్రతి నెలా ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు తక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా, మీరు మీ పోర్ట్‌ఫోలియోతో ఎంత సాంప్రదాయంగా ఉంటే, మీ లక్ష్యాన్ని సాధించడానికి అంత ఎక్కువ సమయం పడుతుంది.


రెండో విషయం... SIPలో చిన్నపాటి స్టెప్-అప్‌తో, రూ. 10 కోట్ల సంపద లక్ష్యాన్ని సాధించడానికి పట్టే సమయాన్ని 6 నుంచి 13 సంవత్సరాల వరకు తగ్గించవచ్చు. స్టెప్-అప్ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, సమయాన్ని ఇంకా తగ్గించవచ్చు. ఉదాహరణకు, మీరు ప్రతి సంవత్సరం మీ SIPని 20 శాతం పెంచాలనుకుంటే, సంవత్సరానికి 12 శాతం రాబడి మీద, రూ. 10 కోట్ల సంపద సృష్టించడానికి మీకు 25 సంవత్సరాలకు బదులు 19 సంవత్సరాలు సరిపోతుంది.