FD Interest Rates: 


రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) రెపోరేట్ల పెంపుతో నెలసరి వాయిదాలు పెరిగి రుణ గ్రహీతలు ఇబ్బంది పడుతున్నారు. డబ్బు జమ చేసే వాళ్లేమో సంతోషిస్తున్నారు. ఎందుకంటే గతంతో పోలిస్తే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCs) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. స్వల్ప కాలంలోనే ఎక్కువ రిటర్న్‌ అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే రెండేళ్ల ఎఫ్‌డీలపై ఏకంగా 8 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లు ఎప్పట్లాగే మరో అరశాతం అదనపు వడ్డీ పొందొచ్చు.


రెండేళ్ల కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) చేయాలనుకుంటే ఈ బ్యాంకులను పరిశీలించండి.


డీసీబీ బ్యాంక్‌ (DCB Bank): రెండేళ్ల కాలంలో మెచ్యూరిటీ పొందే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై డీసీబీ బ్యాంకు అత్యధిక వడ్డీరేటు ఆఫర్‌ చేస్తోంది. 700 రోజుల నుంచి 24 నెలల మధ్య మెచ్యూరిటీ పొందే ఎఫ్‌డీలపై 8 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లు ఇదే సమయంలో 8.5 శాతం మేర రాబడి పొందొచ్చు.


యెస్‌ బ్యాంక్‌ (Yes Bank): ప్రైవేటు రంగ బ్యాంకు యెస్‌ బ్యాంక్‌ సైతం మంచి వడ్డీనే అందిస్తోంది. 18 నెలల నుంచి 36 నెలల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లు ఇదే కాల వ్యవధికి 8.25 శాతం మేర ఆదాయం పొందొచ్చు.


ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (IDFC First Bank): ప్రైవేటు రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ఒకటి. రెండేళ్ల కాలానికి 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. అలాగే 18 నెలల నుంచి  మూడేళ్ల కాలానికి చెందిన ఎఫ్‌డీలకూ ఇదే రేటు వర్తిస్తుంది. ఇక సీనియర్‌ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ ఇస్తోంది.


ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ (Indus Ind Bank): రెండేళ్ల తర్వాత మెచ్యూరిటీ అయ్యే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 7.75 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 8.25 శాతం మేర వడ్డీరేటు వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది.


సాధారణంగా మన వద్ద ఉంచుకొనే నగదుకు కాలం గడిచే కొద్దీ విలువ తగ్గుతుంది. ఏటా ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం 6-6.5 శాతం మేర ఇన్‌ఫ్లేషన్‌ ఉంది. అంటే ఒక లక్ష రూపాయల నగదు విలువలో ఏడాది గడిచే సరికి 6 శాతం తగ్గిపోతుంది! అలాగే మీరు 6 శాతం వడ్డీకి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినా దాని విలువ ఏమీ పెరగదు. ద్రవ్యోల్బణంతో సమం అవుతుంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేటప్పుడు వీటిని గుర్తు పెట్టుకొని అధిక వడ్డీ ఇచ్చే సురక్షిత సాధనాలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.