Know What To Do When You Get One fake note in atms: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నకిలీ నోట్ల (Fake Currency notes) బెడద తప్పడం లేదు! 2021-22 ఆర్థిక ఏడాదిలో బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.500 దొంగనోట్ల శాతం రెట్టింపైందని ఆర్బీఐ (RBI) తెలిపింది. ఈ సంఖ్య 79,669కు చేరడంతో నోట్ల శాతం 102కు పెరిగిందని పేర్కొంది. ఇక 13,604 రూ.2000 నోట్లను గుర్తించామని తెలిపింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగాయని వెల్లడించింది. ఒకవేళ ఏటీఎంలో దొంగనోటు వస్తే ఏం చేయాలో వివరించింది.
ఎన్ని గుర్తించారంటే?
2019-20లో 30,054 రూ.500 దొంగనోట్లను బ్యాంకులు గుర్తించాయి. 2020-21లో ఈ సంఖ్య 39,453కు పెరిగింది. 2021-22లో 79,669కు చేరుకుంది. అంటే 102 శాతం పెరిగింది. ఇక రూ.10, 20, 200, 500 దొంగనోట్ల శాతం వరుసగా 16.4, 16.5, 11.7, 101.9, 54.6గా ఉంది. 2011-16 నుంచి 2017-22 మధ్యన ఐదేళ్లలో దొంగనోట్ల గుర్తింపు శాతం 42కు చేరుకుంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-2016 మధ్యన 27,35,052 దొంగనోట్లను గుర్తించారు. 2016లో 7,62,072 గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత 2017-22 మధ్య 15,76,458 దొంగనోట్లు గుర్తించారు.
నోట్ల రద్దు తర్వాత
నోట్ల రద్దుకు ముందు బ్యాంకింగ్ వ్యవస్థలో 2012 నుంచి 17 మధ్యన ఏటా 5.21 లక్షలు, 4.98, 4.88, 5.94, 6.36, 7.62 లక్షల దొంగనోట్లను గుర్తించారు. రద్దు తర్వాత వీటి సంఖ్య భారీగా తగ్గింది. 2018-22 మధ్యన ఏటా 5.22 లక్షలు, 3.17, 2.96, 2.08, 2.30 లక్షలు గుర్తించారు.
శిక్షలు ఇవీ
దొంగనోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్ (FICN)గా పిలుస్తారు. ఈ నోట్లను చలామణీలోకి తెస్తే జీవితఖైదు విధిస్తారు. ఐపీసీ సెక్షన్ 489C ప్రకారం ఇది నేరం. నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవితకాలం జైలు శిక్ష విధిస్తారు.
ఏటీఎంలో దొంగనోట్లు వస్తే ఏం చేయాలి?
- ఏటీఎంలో దొంగనోట్లు గుర్తించిన వెంటనే సీసీటీవీ ముందు నిలబడి నోటు ముందు, వెనకవైపు చూపించాలి.
- దొంగనోటు గురించి అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుకు తెలియజేయాలి.
- ఆ ఏటీఎం లావాదేవీకి సంబంధించిన రిసిప్టును భద్రపరుచుకోవాలి.
- ఆ తర్వాత బ్యాంకు వెళ్లి దానిని డిపాజిట్ చేయాలి. వారికి ఏటీఎం రిసిప్టు చూపించాలి.
- బ్యాంకు అధికారులు తమ నిబంధనలను అనుసరించి అసలు నోటును ఇస్తారు.
- ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి దొంగనోట్లు వస్తే సాధ్యమైనం త్వరగా కస్టమర్‌కు అసలు నోట్లు ఇవ్వాలి. బ్యాంకు ఇందుకు నిరాకరిస్తే ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది.