సంఘటిత రంగంలో దాదాపుగా అందరు ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో కొంత మొత్తాన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసుకుంటారు. ఇందుకోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనే ప్రభుత్వ యాజమాన్య సంస్థ పనిచేస్తుందని తెలిసిందే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను పీఎఫ్ ఖాతా అని కూడా పిలుస్తారు. ఈపీఎఫ్ ఖాతాదారుల ప్రతినెలా మూల వేతనంలో 10 శాతం కట్ అవుతుంది. గతంలో 12 శాతంగా ఉన్న భవిష్యనిధి మొత్తాన్ని ఇటీవల తగ్గించారు. ఈ నగదుతో పాటు ఉద్యోగి పనిచేసే కంపెనీ యాజమాన్యం సైతం అంతే నగదు మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది.
నిర్దేశిత మొత్తం ప్రతినెలా ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి కట్ చేసి ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ ఖాతాలలో నగదుకు వడ్డీని సైతం చెల్లిస్తుంది. ఉద్యోగికి పన్ను మినహాయింపు అందించడంతో పాటు భవిష్య నిధిగా దోహదం చేస్తుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. గత ఏడాది కరోనా కష్ట కాలంలోనూ ఈపీఎఫ్ ఖాతాదారులకు అండగా నిలిచేందుకు మూడు నెలల వేతనాన్ని ముందస్తుగా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇటీవల కోవిడ్19 అడ్వాన్స్ విధానాన్ని తీసుకొచ్చి సరైన సమయంలో ఈపీఎఫ్ ఖాతాదారుల చేతికి నగదు వచ్చే ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎలాంటి పత్రాలు సమర్పించకుండానే నగదు అందించేందుకు ఈపీఎఫ్ఓ ఓ మెమోరాండం విడుదల చేసింది. తద్వారా ఏ డాక్యుమెంట్స్ సమర్పించకుండానే రూ.1 లక్ష వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే కోవిడ్19 లేదా ఇతర ప్రాణాంతకమైన అనారోగ్య సమస్య ఉన్న వారికి మెడికల్ అడ్వాన్స్ కింద ఎలాంటి పత్రాలు తీసుకోకుండానే లక్ష రూపాయాల వరకు సాయం అందిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆసుపత్రిలో చేరే సమయంలో ఎంత ఖర్చు అవుతుందో తెలపడం కష్టం కనుక ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రభుత్వ, పీఎస్‌యూ, సీజీహెచ్‌ఎస్ లాంటి ఆసుపత్రులలో చేరిన వారికి మెడికల్ అడ్వాన్స్ లభిస్తుంది.
ఈపీఎఫ్ ఉద్యోగి లేదా వారి కుటుంబసభ్యులకు చికిత్స కోసం మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి అంచనా బిల్లు లేదా వివరాలు, పత్రాలు సమర్పించకున్నా కేవలం రిక్వెస్ట్ చేస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న రోజు లేదా ఆ మరుసటిరోజు కచ్చితంగా మెడికల్ అడ్వాన్స్ లక్ష రూపాయాలు ఈపీఎఫ్ ఖాతాదారులకు అందుతాయి. పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేలోగా అందుకు సంబంధించిన అంచనా బిల్లు, వీలైతే బిల్లులను సమర్పించాలి. పేషెంట్ డిశ్ఛార్జ్ అయి 45 రోజుల్లోగా కచ్చితంగా పూర్తి బిల్లులను సమర్పించాలని ప్రకటనలో స్పష్టం చేసింది.