EPFO Rules: దేశవ్యాప్తంగా కోట్లాది మంది EPFO సబ్‌స్క్రైబర్లు (EPFO Subscribers) ఉన్నారు. EPFO నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి 10 సంవత్సరాలు పని చేస్తే, అతను పెన్షన్ పొందటానికి అర్హుడు. ప్రతి ఉద్యోగి బేసిక్ జీతంలో 12 శాతాన్ని ఈపీఎఫ్‌వోలో జమ చేస్తారు. ఇందులో 8.33 శాతం పెన్షన్ ఖాతాలో, 3.67 శాతం ఈపీఎఫ్‌లో జమ చేస్తారు.
చాలామంది, తాము చేస్తున్న ఉద్యోగాలను రకరకాల కారణాల వల్ల మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతుంటారు, ఇలాంటి వాళ్లు మన మన బంధుమిత్రుల్లోనూ కనిపిస్తుంటారు. ఇదే సమయంలో, కొంతమంది ఉద్యోగం నుంచి దీర్ఘకాలిక విరామం కూడా తీసుకుంటారు, తిరిగి వచ్చి మళ్లీ అదే ఉద్యోగంలో లేదా వేరే ఉద్యోగంలో చేరుతుంటారు. ఈ ఉదాహరణలో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు. వివాహం, డెలివెరీ, పిల్లల బాగోగులు, ఇంటి బాధ్యతలు సహా కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసి, కొంతకాలం తర్వాత మళ్లీ జాబ్‌లో చేరుతుంటారు.
ఈ నేపథ్యంలో, ఉద్యోగం మధ్యలో వదిలేసి వెళ్లిపోయి, మళ్లీ వచ్చి ఉద్యోగంలో చేరితే పెన్షన్ ప్రయోజనం ఉంటుందా, ఉండదా అన్నది చాలా కీలకమైన ప్రశ్న. ఈపీఎఫ్ చందాదార్ల మదిలో తరచుగా తలెత్తే అనుమానం ఇది. EPFOకి సంబంధించిన ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుంటే, ఇలాంటి సందేహాలకు సమాధానం దొరుకుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది.
10 సంవత్సరాలు పని చేయాలన్న నియమం ఏంటి?
EPFO నిబంధనల (EPFO Rules) ప్రకారం... ఒక వ్యక్తి ఏదైనా కారణం వల్ల ఉద్యోగం మానేసి, కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాలనుకుంటే, పని చేసిన గత సంవత్సరాలను అతని మొత్తం ఉద్యోగ కాలానికి కలుపుతారు. EPF పెన్షన్ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, ఒక ఉద్యోగి తన మొత్తం ఉద్యోగ కాలంలో కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అంటే, ఉద్యోగ జీవితంలో విరామం తీసుకున్నా, ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినా, మొత్తం పది సంవత్సరాలు పని చేస్తే అతను పెన్షన్ తీసుకోవడానికి అర్హుడవుతాడు.
ఒక ఉద్యోగి తాను పని చేస్తున్న సంస్థ నుంచి వేరొక సంస్థకు మారితే, అతని UAN ( Universal Account Number) మారదు. ఇదే నంబర్ అతని పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. దీని వల్ల అతని వివరాలు, ఉద్యోగ కాలం కొనసాగుతూనే ఉంటుంది తప్ప మధ్యలోనే పూర్తిగా ఆగిపోదు. ఉద్యోగి కొంత విరామం (స్వల్పకాలం లేదా దీర్ఘకాలం) తీసుకుని జాబ్‌లో చేరితే, ఆ జాబ్ గ్యాప్‌ని తొలగించి మిగిలిన కాలాన్ని లెక్కిస్తారు.
ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం
మీకు ఇంకా స్పష్టత రాకపోతే, ఈ విషయాన్ని ఒక ఉదాహరణ సులభంగా అర్ధం చేసుకుందాం. ఒక వ్యక్తి ఒక కంపెనీలో 7 సంవత్సరాలు పని చేసి మానేశాడని అనుకుందాం. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరి మరో నాలుగేళ్లు పని చేశాడని అనుకుందాం. ఇప్పుడు... గ్యాప్ తీసుకోవడానికి ముందు పని చేసిన 7 సంవత్సరాలు, గ్యాప్ తర్వాత పని చేసిన 4 సంవత్సరాలను కలుపుతారు. మొత్తంగా అతను 11 సంవత్సరాలు పని చేసినట్లు పరిగణనిస్తారు. అంటే, EPFO రూల్ ప్రకారం పదేళ్లు దాటి పని చేశాడు కాబట్టి అతను EPF పెన్షన్‌కు అర్హుడు అవుతాడు.
9.5 సంవత్సరాలు పని చేస్తే?
ఒకవేళ ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితం మొత్తంలో 9.5 సంవత్సరాలు పని చేసి అక్కడితో ఆపేస్తే అతనికి పెన్షన్ వస్తుందా? అంటే కచ్చితంగా వస్తుంది. EPFO నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి 9.5 సంవత్సరాలు పని చేసి అక్కడితో ఆపేస్తే, పెన్షన్ కోల్పోకుండా అతనికి 6 నెలల అనుగ్రహం లభిస్తుంది. అతని ఉద్యోగ జీవితాన్ని 10 సంవత్సరాలకు సమానంగా పరిగణించి, పెన్షన్ ఇస్తారు.