EPF Withdrawal Online: ఉద్యోగులు, కార్మికుల కోసం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తున్న 'తప్పనిసరి పొదుపు పథకం' EPF/ఉద్యోగుల భవిష్య నిధి. ఉద్యోగి డబ్బును EPFO నిర్వహిస్తుంది.


ఈ పథకం కింద, ఒక ఉద్యోగి తన జీతంలోని బేసిక్‌ పే, డియర్‌నెస్‌ అలవెన్స్‌ (DA) మొత్తంలో 12% వాటాను పీఎఫ్‌ ఖాతాకు ‍‌(PF Account) జమ చేస్తాడు. ఆ సంస్థ యజమాన్యం కూడా అంతే మొత్తంలో కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. 


ప్రస్తుతం, EPF డిపాజిట్లపై 8.1% వార్షిక వడ్డీని (Annual interest rate on EPF deposits) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ వడ్డీ శాతం మారుతుంది. 


ఉద్యోగి/కార్మికుడు రిటైర్‌ అయిన తర్వాత అతనికి పీఎఫ్‌ డబ్బు + పెన్షన్‌ వస్తుంది. దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే, EPF ఖాతాలోని డబ్బు అతని కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. EPF అకౌంట్‌లో నామినీగా ఉన్న వ్యక్తి ఆ డబ్బు తీసుకుంటారు.


అయితే, ఉద్యోగం చేస్తున్న సమయంలో కొన్ని అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో, ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ EPF అకౌంట్‌లో ఉన్న డబ్బును పూర్తిగా వెనక్కు (Complete EPF Withdrawal) తీసుకోవచ్చు. లేదా, కొంత మొత్తాన్ని మాత్రమే వెనక్కు (Partial PF Withdrawal) తీసుకోవచ్చు. ఉద్యోగి ఉన్న పరిస్థితులకు లోబడి పూర్తిగా/పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.


ఉద్యోగం లేకపోతేనే పూర్తి డబ్బు తీసుకోవడం సాధ్యం
ఉదాహరణకు, EPF కడుతున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయాడనుకుందాం. అతను ఒక నెలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే, అప్పటి వరకు జమ చేసిన మొత్తంలో 75% విత్‌డ్రా చేసుకోవచ్చు. అతను రెండు నెలలు పైగా నిరుద్యోగిగా ఉంటే 25% కూడా వెనక్కు తీసుకోవచ్చు.


PF ఖాతా నుంచి కొంత డబ్బు తీసుకోవాలంటే?
ఉద్యోగంలో కొనసాగుతూనే, అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి కొంత డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే, కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమే దీనికి అనుమతి లభిస్తుంది. అవి... 1. చదువు కోసం, 2. వైద్య చికిత్స కోసం, 3. వివాహం కోసం, 4. భూమి కొనడానికి లేదా ఇల్లు కొనడానికి/కట్టుకోవడానికి, 5. హోమ్‌ లోన్‌ కట్టడానికి, 6. ఇంటిని రీమోడల్‌ చేయడానికి. 


ఇవే కాదు, ఉద్యోగ విరమణకు ముందు పీఎఫ్‌ కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి లభిస్తుంది.


ఆన్‌లైన్‌ ద్వారా PF విత్‌డ్రా చేయడానికి ఏమేం అవసరం? ‍‌(What is required to withdraw PF through online?)
1. UAN (Universal Account Number) 
2. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ 
3. ఆధార్ నంబర్ ‍(ఇది తప్పనిసరిగా UANతో లింక్ అయి ఉండాలి) 
4. ఆధార్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ అకౌంట్‌ 
5. విత్‌డ్రా సంబంధిత ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ 


ఆన్‌లైన్‌లో PF డబ్బును విత్‌డ్రా చేసే విధానం (Steps to withdraw PF amount online)
స్టెప్‌ 1. EPFO e-SEWA పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి
స్టెప్‌ 2. ఆన్‌లైన్ క్లెయిమ్స్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి
స్టెప్‌ 3. బ్యాంక్ అకౌంట్‌ వివరాలను నమోదు చేయాలి 
స్టెప్‌ 4. టర్మ్స్‌&కండిషన్స్‌ బాక్స్‌లో టిక్‌ చేయండి
స్టెప్‌ 5. డబ్బు విత్‌డ్రా చేస్తున్న కారణాన్ని ఎంచుకోండి
స్టెప్‌ 6. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్‌ చేసి, తగిన ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయండి
స్టెప్‌ 7. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ నొక్కండి. 


అన్ని డాక్యుమెంట్స్‌ను మీ దగ్గర పెట్టుకుంటే, అప్లికేషన్ సమర్పించే పని కేవలం 2 నిమిషాల్లో పూర్తవుతుంది. EPFO అధికార్లు మీ అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేసి, మీ బ్యాంక్‌ అకౌంట్‌లోకి డబ్బు జమ చేస్తారు.


మరో ఆసక్తికర కథనం: వేలిముద్ర వేస్తేనే కొత్త సిమ్‌, పాత నంబర్లకు కూడా బయోమెట్రిక్‌ గుర్తింపు