Tips To Increase CIBIL Score Quickly: మన దేశంలో చాలా మందికి బ్యాంక్‌ లోన్‌ అవసరం. ఇప్పటి కాలంలో, బ్యాంక్‌ లోన్‌ ఈజీగానే దొరుకుతోంది. కాకపోతే, తక్కువ వడ్డీ రేటుకు లోన్‌ పొందాలంటే మాత్రం మంచి క్రెడిట్‌ స్కోర్‌ తప్పనిసరి. మీ క్రెడిట్ స్కోర్ మీ మొత్తం ఆర్థిక చరిత్ర (Credit history)ను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా, బ్యాంక్‌లు సహా వివిధ ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ స్కోర్‌ ‍‌(IBIL Score)ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. క్రెడిట్‌ స్కోర్‌/ సిబిల్‌ స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే, బ్యాంక్‌ నిబంధనలు మీకు అంత అనుకూలంగా ఉంటాయి.


ఒకవేళ, మీ క్రెడిట్ స్కోర్‌ తక్కువగా ఉంటే, దానిని పెంచుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్థిరమైన ప్రయత్నాలు, ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్‌ స్కోర్‌ను సులభంగా పెంచుకోవచ్చు.


మీ క్రెడిట్ స్కోర్‌ను ఇలా పెంచుకోండి...


క్రెడిట్ రిపోర్ట్‌ సమీక్ష
సంబంధిత క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ కాపీని తీసుకోండి. ఇది మీ క్రెడిట్ హిస్టరీ మొత్తాన్ని గణాంకాలతో సహా చూపిస్తుంది. ఆ రిపోర్ట్‌లో తప్పుడు వ్యక్తిగత సమాచారం లేదా మోసపూరిత కార్యకలాపాలు వంటివి ఏవైనా ఉన్నాయేమో చెక్‌ చేయాలి. అలాంటి లోపాలు మీ కంటబడితే, వాటిని సరిదిద్దడానికి క్రెడిట్ బ్యూరోకు తక్షణం తెలియజేయండి, ఈ తప్పులను సరిదిద్దడం వలన మీ స్కోర్ వెంటనే మెరుగుపడుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ సంబంధిత ఇబ్బందులు ఉంటే మీ క్రెడిట్ బ్యూరో కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.


సకాలంలో చెల్లింపులు
మీ క్రెడిట్ స్కోర్‌ మీద వెంటనే ప్రభావం చూపే ప్రధానాంశం మీ 'పేమెంట్‌ హిస్టరీ'. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ EMIలను సకాలంలో చెల్లించడం అలవాటుగా మార్చుకోండి. గడువు తేదీని మిస్‌ చేయకుండా ఉండేందుకు మీ ఫోన్‌లో రిమైండర్‌లు సెట్ చేయండి. లేదా, 'ఆటో పే' ఆప్షన్‌ ఎంచుకోండి. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, మినిమన్‌ అమౌంట్‌ అయినా చెల్లించండి. ఒక్క పేమెంట్‌ మిస్‌ చేసినా మీ క్రెడిట్ ప్రొఫైల్‌ ప్రతికూలంగా ప్రభావితం అవుతుందని గుర్తుంచుకోండి.


క్రెడిట్‌ లిమిట్‌
మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్‌ లిమిట్‌లో, మీ వినియోగ నిష్పత్తిని 30 శాతం కంటే తక్కువగా ఉంచండి. కార్డ్‌ ఉంది కదాని క్రెడిట్‌ బ్యాలెన్స్‌ అయిపోయేవరకు వాడకూడదు. ఇలాంటి వ్యక్తులకు సరైన ఆదాయం లేదని, క్రెడిట్‌ కార్డ్‌ మీదే ఆధారపడుతున్నారని క్రెడిట్‌ బ్యూరో భావిస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి, క్రెడిట్‌ కార్డ్‌లో 30 శాతం మించి వాడుకోవద్దు. అది మీ అవసరాలకు సరిపోకపోతే, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లను చెల్లించండి లేదా క్రెడిట్ లిమిట్‌ పెంచమని బ్యాంక్‌ను రిక్వెస్ట్‌ చేయండి. 


కొత్త క్రెడిట్ కోసం అదేపనిగా అప్లై చేయొద్దు
కొత్త క్రెడిట్ కార్డ్‌ లేదా క్రెడిట్ లైన్‌ కోసం వెంటవెంటనే దరఖాస్తు చేసుకోవడం మానుకోండి. ఎందుకంటే, ప్రతి కొత్త దరఖాస్తు సమయంలో బ్యాంక్‌ మీ క్రెడిట్ రిపోర్ట్‌ తీసుకుంటుంది, ఇది మీ స్కోర్‌ను తాత్కాలికంగా తగ్గిస్తుంది. కొత్త క్రెడిట్‌ కార్డ్‌ కోసం అప్లై చేయడానికి బదులుగా, మీ ప్రస్తుత అకౌంట్‌లను తెలివిగా సర్దుబాటు చేసుకోవడంపై దృష్టి పెట్టండి. 


క్రెడిట్ మిశ్రమంలో వైవిధ్యం
మీ క్రెడిట్ ప్రొఫైల్‌లో వివిధ రకాల లోన్‌లు ఉంటే క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. మీ క్రెడిట్‌ పోర్ట్‌ఫోలియోలో చిన్నపాటి వ్యక్తిగత రుణం లేదా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును యాడ్‌ చేయండి. వివిధ రకాల క్రెడిట్‌లు ఉండటం, వాటిని బాధ్యతాయుతంగా నిర్వహించడం వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌ వేగంగా పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఫోన్‌ తియ్‌, స్కాన్‌ చెయ్‌ - యూపీఐని మామూలుగా వాడడం లేదుగా!