Gold Rate At All-Time High: కేంద్ర బడ్జెట్‌ టైమ్‌ అతి సమీపంలోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2025న, 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం సాధారణ బడ్జెట్‌ (Union Budget 2025)ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ప్రస్తుతం, మన దేశంలో బంగారం కొనుగోళ్లపై 3% వస్తు & సేవల పన్ను (GST on gold purchases) విధిస్తున్నారు. వచ్చే బడ్జెట్‌లో దీనిని పెంచుతారా లేక యథాతథంగా కొనసాగిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బడ్జెట్‌కు ముందు, గోల్డ్‌ డిమాండ్‌ పెరిగింది. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బలమైన గిరాకీతో పాటు అంతర్జాతీయ కారణాల వల్ల, జనవరిలో బంగారం ధర ఆల్-టైమ్ హై (Gold price at all-time high) స్థాయికి చేరుకుంది. 


వెడ్డింగ్‌ సీజన్‌ & అంతర్జాతీయ అనిశ్చితులు
మన దేశంలో ఈ నెలాఖరు నుంచి రెండు నెలల వరకు పెళ్లిళ్ల సీజన్‌ ‍‌(Wedding season) ఉంది. ఈ రెండు నెలల్లో దాదాపు సగం రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ కారణంగా దేశీయంగా నగల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దేశీయ డిమాండ్‌కు అంతర్జాతీయ అనిశ్చితులు కూడా తోడైంది. ఆభరణాల వ్యాపారులు & రిటైలర్ల భారీ కొనుగోళ్ల కారణంగా, జనవరి 2025లో, స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) 10 గ్రాముల ధర గరిష్టంగా రూ. 83,750కి చేరుకుని సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 82,840 వద్ద ముగిసింది. 'ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్' ఈ సమాచారాన్ని వెల్లడించింది. వెల్లడించింది.  


దాదాపు రూ.4400 పెరిగిన పుత్తడి రేటు
01 జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు, 24 కేరెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,360 పెరిగి రూ. 79,390 నుంచి రూ. 83,750కి చేరుకుంది. ఈ వారం ప్రారంభంలో వరుసగా రెండు రోజులు క్షీణించినప్పటికీ, తర్వాత పుంజుకుని, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ. 910 పెరిగి రూ. 83,350 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. మంగళవారం ఇది రూ. 82,440 వద్ద ముగిసింది. క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి రూ. 93,000కి చేరింది. 


MCXలో, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర రూ. 228 పెరిగి ఫిబ్రవరి నెల కాంట్రాక్ట్‌ రూ. 80,517 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెల కాంట్రాక్ట్‌ 10 గ్రాముల ధర రూ. 81,098కి చేరింది. అమెరికాలో డాలర్ ఇండెక్స్ పెరగడం, వినియోగదారుల డిమాండ్ డేటా బలహీనంగా ఉండటంతో బంగారం ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా, కమోడిటీ మార్కెట్‌లో బంగారం ఫ్యూచర్లు ఔన్స్‌కు 2,794.70 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.


HDFC సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీ) సౌమిల్ గాంధీ చెప్పిన ప్రకారం, "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిస్తున్న టారిఫ్ ప్లాన్‌లను దృష్టిలో పెట్టుకుని, వ్యాపారులు సురక్షితమైన పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా బుధవారం గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం పెరిగింది". 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. బంగారంలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మీ వ్యక్తిగత వివరాలు చైనాకు చేరవేత? డీప్‌సీక్‌ వాడుతున్న వాళ్లు జర భద్రం!