Real Estate: దేశంలో స్థిరాస్థి రంగం ఇప్పుడు ఫుల్ రైజింగ్‌లో ఉంది. ఇళ్ల క్రయవిక్రయాలు ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతున్నాయి. ఇళ్ల ధరలు (Home prices) కూడా ఏటికేడు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అందుబాటు ధరల & మధ్య ఆదాయ గృహాలకు డిమాండ్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా' (క్రెడాయ్) సూచించింది. గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై 100 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని కూడా కోరింది.
అందుబాటు ధరల గృహాల పరిమితి పెంచాలి
ప్రస్తుతం, 45 లక్షల రూపాయల వరకు ఖరీదైన ఇళ్లను అందుబాటు ధరల గృహాలుగా (affordable housing) ప్రభుత్వం పరిగణిస్తోంది. ఈ పరిమితిని కనీసం 75-80 లక్షల రూపాయల వరకు పెంచాలని క్రెడాయ్ ప్రతిపాదించింది. అందుబాటు ధరల & మధ్య ఆదాయ గృహాలకు గిరాకీ పెంచేందుకు, రూ. 75-80 లక్షల ధరతో నిర్మాణంలో ఉన్న ఇళ్లపై GST రేటును 1 శాతానికి పరిమితం చేయాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ (CREDAI President Boman Irani) సూచించారు.
ప్రస్తుతం, నిర్మాణంలో ఉండి & రూ. 45 లక్షల వరకు ధర ఉన్న అఫర్డబుల్ హౌస్‌లపై 1 శాతం GST రేటు అమలు చేస్తున్నారు. రూ. 45 లక్షల కంటే కంటే ఎక్కువ రేటు ఉన్న ఇళ్లకు 5 శాతం పన్ను విధిస్తున్నారు. ఇళ్ల నిర్మాణదార్లు (developers) వీటికి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను (input tax credit) కూడా క్లెయిమ్ చేయలేరు.
అఫర్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని 2017లో ప్రవేశపెట్టి రూ. 45 లక్షల పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ద్రవ్యోల్బణం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అఫర్డబుల్ హౌసింగ్ పరిమితిని రూ. 75-80 లక్షలకు పెంచాలన్నది బొమన్ ఇరానీ వాదన. అఫర్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని మారిస్తే, గృహ కొనుగోలుదారులపై పన్ను భారం భారీగా తగ్గుతుందని, ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని చెప్పారు.
ప్రభుత్వం ధరల పరిమితిని పూర్తిగా రద్దు చేసి, కేవలం కార్పెట్ ఏరియా ఆధారంగా మాత్రమే అఫర్డబుల్ హౌసింగ్‌ను నిర్ణయించాలని కూడా బొమన్ ఇరానీ సూచించారు. ప్రస్తుతం, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 60 చదరపు మీటర్లు, నాన్-మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా పరిమితులను కొనసాగించాలన్నారు.
రూ.2 లక్షలు కాదు, 100% మినహాయింపు
ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండాలంటే పన్నులు తగ్గాలని కూడా క్రెడాయ్ సూచించింది. గృహ రుణ వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతమున్న రూ. 2 లక్షల మినహాయింపు పరిమితి స్థానంలో పూర్తిగా 100 శాతం తగ్గింపు ఇవ్వాలని క్రెడాయ్ కాబోయే ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ చెప్పారు. ఇది ఇళ్ల డిమాండ్‌ను గణనీయంగా పెంచుతుందని అన్నారు.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీపై మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ.2 లక్షలుగా ఉంది.
1999లో ప్రారంభమైన CREDAIలో దేశవ్యాప్తంగా 13,000 మందికి పైగా రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు సభ్యులుగా ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద కొత్త పాన్ తీసుకోవాలా? - టాక్స్‌పేయర్లలో తలెత్తే సందేహాలకు సమాధానాలు ఇవిగో