Health Insurance Cover on Covid New Variant JN 1: గత నెల నుంచి మన దేశంలో కొవిడ్‌ (COVID-19) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ (Omicron) సబ్-వేరియంట్ JN.1 ను అదుపు చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. 


దేశంలోని ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దిల్లీలోని "ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్" (AIIMS) కొన్ని గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఆసుపత్రులకు వచ్చే COVID-19 అనుమానిత లేదా పాజిటివ్ కేసుల కోసం ఆ  మార్గదర్శకాలు జారీ చేసింది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కొత్త వేరియంట్‌ను సీరియస్‌గా తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్లకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లకు ఈ కొత్త వేరియంట్ ప్రాణాంతకంగా మారిందని ఇప్పటికే రుజువైంది.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం (02 జనవరి 2023) రిలీజ్‌ చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఒక రోజులో మూడు కొవిడ్‌-సంబంధిత మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 636 కరోనా వైరస్ కేసులను గుర్తించారు.


కరోనా లక్షణాలు కనిపించిన తొలి రోజుల్లోనే తగిన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే, ఆ వైరస్‌ బారి నుంచి సులభంగా కోలుకోవచ్చు. ఒక మంచి ఆరోగ్య బీమా (Good Health Insurance Cover) తోడుగా ఉంటే ఇంకా ధైర్యంగా ఉంటుంది. 


మీకు ఇప్పటికే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే, కొత్త కరోనా వేరియంట్‌ను ఆ పాలసీ కవర్‌ చేస్తుందో, లేదో తెలుసుకోవడం చాలా అవసరం. దీనికోసం బీమా కంపెనీతో మాట్లాడండి. ప్రస్తుతం పాలసీలో కొత్త వేరియంట్‌ కవర్‌ కాకపోతే, రైడర్స్‌ ‍‌(Riders) రూపంలో అదనపు బీమా కవరేజ్‌ తీసుకోవాలి.


సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ ‍‌(comprehensive health insurance policy)
సాధారణంగా, అనారోగ్యానికి దారి తీసే అన్ని రకాల ఇన్ఫెక్షన్‌లకు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలో కవరేజ్‌ ఉంటుంది, కొత్త కరోనా వేరియంట్‌ JN.1 కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కాబట్టి, దాదాపు ప్రతి బీమా కంపెనీ కరోనా కొత్త వేరియంట్‌ అటాక్‌ అయితే కవరేజీ అందిస్తుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే అనారోగ్యాల వల్ల పాలసీదారు ఇన్‌-పేషెంట్‌గా హాస్పిటల్‌లో చేరితే, ఆ ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. అంతేకాదు, ఆసుపత్రిలో చేరడానికి ముందు, ఆసుపత్రిలో చేరిన తర్వాత సంరక్షణ వరకు పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.


ఇప్పుడు, చాలా బీమా కంపెనీలు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) కవర్‌ను కూడా అందిస్తున్నాయి. అంటే, అనారోగ్యం బారిన పడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సిన (ఇన్‌-పేషెంట్‌) పరిస్థితి లేకపోతే, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చుల్ని బీమా కంపెనీ భరిస్తుంది. ఆసుపత్రికి తరలించే పరిస్థితిలో రోగి లేకపోవడం, ఆసుపత్రిలో గది అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్‌ పొందొచ్చు. ఈ విషయాన్ని బీమా కంపెనీకి ముందుగానే తెలియజేయాలి.


మీరు తీసుకున్న ఇన్సూరెన్స్‌ పాలసీ, 'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్'ను (Domiciliary Hospitalisation) కవర్ చేస్తే... ఇన్-పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందవచ్చు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోతే, వైద్యుల సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ కవరేజ్‌ ఉంటుంది.


ఔట్ పేషెంట్ ఖర్చుల్ని కవర్ చేయడానికి కూడా యాడ్-ఆన్‌ (Add-on) ఎంచుకోవచ్చు. 


బీమా పాలసీల్లో మినహాయింపులు
మరోవైపు, ఆరోగ్య బీమా పథకాల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందస్తుగా ఉన్న అనారోగ్యాలు, జీవనశైలి సంబంధిత వ్యాధులు, అందానికి సంబంధించిన ప్రక్రియలు (cosmetic procedures), ప్రకృతి వైద్యం, ఆక్యుప్రెషర్ వంటి చికిత్సలు కవరేజ్‌లోకి రావు.


ప్రస్తుతం, వైద్య ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంది. వైరల్ వ్యాధులు అకస్మాత్తుగా వచ్చి పడతాయి, అత్యవసర పరిస్థితిని కల్పిస్తాయి. కాబట్టి, సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ ఉండడం చాలా అవసరం. పాలసీకి యాడ్-ఆన్స్‌ ఉండడం కూడా మంచిది. హెల్త్‌ పాలసీలోకి రాని ఖర్చుల్ని (బయటి నుంచి కొనాల్సినవి, డైలీ అలవెన్స్‌, రూమ్ రెంట్‌ లాంటివి) అవి కవర్‌ చేస్తాయి. 


మరో ఆసక్తికర కథనం: