Gold Rates: వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు దేశాలు పసిడిని ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించటం, సంపదను నిల్వచేయటం కోసం వినియోగిస్తుంటాయి. అయితే ప్రస్తుతం భూమి మీద బంగారం మెుత్తం అయిపోతుందా, భవిష్యత్తులో ఇక దొరకదేమో అన్నట్లుగా చైనా కొనుగోళ్లు చేపడుతోంది. చైనా చేస్తున్న పనితో ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరలు భగభగమంటున్నాయి. సామాన్యులైతే బంగారం అనే మాట పలకాలంటేనే భయపడిపోతున్నారు. 


చైనాలో ఆర్థిక వ్యవస్థ కుంటుబడటం, హౌసింగ్ క్రైసిస్, బ్యాంకింగ్ క్రైసిస్ వంటి ఇతర కారణాలతో అస్థిరత కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది చైనీయుల తమ సంపద విలువను కాపాడుకునేందుకు కొన్ని నెలలుగా పసిడి కొనుగోళ్లు చేపడుతున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధరను 2,400 డాలర్ల కంటే పైకి నడిపించింది. అక్కడ చాలా మంది స్టాక్ మార్కెట్లను సైతం నమ్మకపోవటం ప్రస్తుత పరిస్థితులను దారితీసింది. వాస్తవానికి వ్యక్తుల నుంచి చైనాలో పసిడికి డిమాండ్ ఒకపక్క కొనసాగుతుండగా.. మరో పక్క చైనా సెంట్రల్ బ్యాంక్ సైతం తన పసిడి నిల్వలను నిరంతరం పెంచుకుంటోంది. బంగారం మార్కెట్‌లో చైనా ఇప్పటికే గణనీయమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.


2022 చివరి నుంచి అంతర్జాతీయంగా బంగారం ధర దాదాపు 50% మేర ర్యాలీని నమోదు చేసింది. ప్రస్తుతం బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకోవటం భారతీయ పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి గతవారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచటం రేట్ల ర్యాలీని కొనసాగింపజేసింది. వడ్డీ రేట్లను పెంచకపోవటంతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి తగ్గింపు మెుదలవుతుందని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు తమ సంపదను బాండ్స్ మార్కెట్ల నుంచి గోల్డ్ మార్కెట్లలోకి తరలిస్తున్నారు. వడ్డీ ఆదాయాలు తగ్గుతాయని సంపదను పసిడి రూపంలోకి మార్చటం కొనసాగిస్తున్నారు.


ప్రస్తుతం చైనాలో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వం నిస్సందేహంగా బంగారం ధరను పెంచుతోందని లండన్‌కు చెందిన మెటల్స్‌డైలీ సీఈవో రాస్ నార్మన్ అన్నారు. ప్రస్తుతం చైనాలో మొదటి త్రైమాసికంలో 6% పెరిగినట్లు చైనా గోల్డ్ అసోసియేషన్ పేర్కొంది. గత ఏడాది ఇది 9 శాతంగా ఉంది. చైనాలో సంప్రదాయంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ అక్కడి ప్రజలను పసిడి ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో బంగారం వ్యాపారం చేస్తున్న చైనా ఫండ్స్‌లోకి చాలా డబ్బు వచ్చింది. ఇదే క్రమంలో మార్చిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన బంగారం నిల్వలను వరుసగా 17వ నెలలో పెంచుకుంది. దాదాపు 50 ఏళ్ల కంటే ఎక్కువగా చైనా తన పసిడి నిల్వలను పెంచుకుంది. దశాబ్ద కాలంగా అమెరికా ట్రెజరీలలో చైనా తన వాటాను తగ్గించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో 2021లో 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా రుణాన్ని చైనా మార్చి నాటికి 775 బిలియన్ డాలర్లకు తగ్గించుకుంది. 


గతంలో చైనా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు యువాన్‌ను ఉపయోగించి దేశీయంగా కొనుగోలు చేసేదని బీజింగ్‌లోని బీవోసీ ఇంటర్నేషనల్ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ గ్వాన్ టావో తెలిపారు. అయితే ఈ సారి డ్రాగన్ దేశం గోల్డ్ కొనుగోలుకు బ్యాంక్ విదేశీ కరెన్సీలను ఉపయోగిస్తోంది. అలాగే రష్యాపై విధించిన ఆంక్షల కింద రష్యా డాలర్ హోల్డింగ్‌లను స్తంభింపజేసేందుకు అమెరికా చర్యలు తీసుకోవడంతో చైనాతో సహా పలు సెంట్రల్ బ్యాంకులు ఆ డబ్బుతో భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని వెల్లడైంది. వాస్తవానికి చైనా విదేశీ మారకద్రవ్య నిల్వల్లో బంగారం వాటా 4.6% మాత్రమే ఉన్నప్పటికీ.. శాతం పరంగా ఇండియా దాదాపు రెట్టిపు పసిడి నిల్వలను కలిగి ఉంది.