Sukanya Samriddhi Yojana: ఈ రోజు ‍‌(నవంబర్‌ 14) బాలల దినోత్సవం. ఏటా నవంబర్‌ 14వ తేదీన దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ దేశాలన్నీ నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటే, భారత్‌లో మాత్రం ఆరు రోజులు ముందుగానే దీనిని నిర్వహిస్తాం. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్‌ 14. ఆయన, చిన్న పిల్లలను అమితంగా ప్రేమించేవారు. చిన్నారులు, జవహర్‌లాల్ నెహ్రూను 'చాచా నెహ్రూ' అని ముద్దుగా పిలిచేవారు. జవహర్‌లాల్ నెహ్రూ గౌరవసూచకంగా, ఆయన జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


మీరు ప్రేమించే మీ కుమార్తెకు ఈ రోజున మంచి బహుమతి ఇవ్వండి. ఆ బహుమతి ఆమె భవిష్యత్‌కు ఉపయోగపడేలా చూడండి. మీకు ఉన్న మంచి ఆప్షన్లలో.. సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. దీనిలో పెట్టుబడి పెడితే, ఆ డబ్బు మీ అమ్మాయి కళాశాల చదువులకు లేదా వివాహానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. 


SSY వడ్డీ రేటు
సుకన్య సమృద్ధి యోజన ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం (small saving schemes). కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేరుకు తగ్గట్లే ఇది కేవలం బాలికల అభ్యున్నతి కోసం నిర్వహిస్తున్న స్కీమ్‌. ఈ పథకం కింద జమ చేసే మొత్తంపై కొంత వడ్డీని సెంట్రల్‌ గవర్నమెంట్‌ చెల్లిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటు మారుతుంది. చివరిసారిగా, ఈ ఏడాది సెప్టెంబర్ 30న వడ్డీ రేటును సవరించారు. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనపై సంవత్సరానికి 8 శాతం వడ్డీని (Sukanya Samriddhi Yojana Interest Rate) ప్రభుత్వం చెల్లిస్తోంది.


ప్రతి నెల ఐదో తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు, సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు. ఆ వడ్డీని ఆ ఆర్థిక సంవత్సరం తర్వాత అకౌంట్‌లో జమ చేస్తారు.


SSY ప్రయోజనాలు
సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ పథకం కాబట్టి, దీనిలో జమ చేసే డబ్బుకు నష్ట భయం ఉండదు. ఈ అకౌంట్‌ కింద ప్రస్తుతం 8 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో SSY అకౌంట్‌లో జమ చేసిన మొత్తంపై ₹1.50 లక్షల వరకు టాక్స్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు, సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు (tax-free).


SSY ఇతర వివరాలు (Sukanya Samriddhi Yojana Online)
సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం బ్యాంక్/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి 21 సంవత్సరాలు. ఆడపిల్లకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం వీలవుతుంది. ఆ తర్వాత డబ్బు జమ చేయలేరు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. SSY ఖాతాలో జమ చేసిన డబ్బును ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: డిజిటల్‌ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌ చేశాక స్టేటస్‌ ఇలా చెక్‌ చేయండి, డౌన్‌లోడ్ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial