Income Tax Refund: 2021-22 ఆర్థిక సంవత్సరానికి లేదా 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఆదాయ పన్ను చెల్లించాల్సిన గడువు ఈ ఏడాది జులై 31తో ముగిసింది. ఆలోగా దాఖలు చేయలేకపోయిన వాళ్లు ఆలస్య రుసుముతో ఈ ఏడాది చివరి వరకు, అంటే 31 డిసెంబర్‌ 2022 వరకు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. అయితే, సెక్షన్ 234(F) కింద 5 వేల రూపాయల వరకు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.


జులై 31 గడువు దాటిన తర్వాత ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే వాళ్ల విషయంలో... పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే, రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.5 లక్షలు దాటితే, రూ.5 వేలు పెనాల్టీ కట్టాలి. ఒకవేళ మీకు రిఫండ్‌ వచ్చే అవకాశం ఉంటే, ఈ పెనాల్టీ మొత్తాన్ని అందులో తగ్గించుకుని, మిగిలిన మొత్తాన్ని ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్టుమెంట్‌ విడుదల చేస్తుంది.


2021-22 ఆర్థిక సంవత్సరానికి లేదా 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి.. ఇప్పటివరకు (సెప్టెంబర్‌ 3, 2022) వరకు 6 కోట్ల 5 లక్షలకు పైగా (6,05,98,840) రిటర్నులు దాఖలయ్యాయి. ఇందులో 5,16,59,426 కేసుల్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) వెరిఫై చేసింది. 


ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు (ఐదు నెలల్లో‌) 1.97 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు 1.14 లక్షల కోట్ల రూపాయలను రీఫండ్‌ల రూపంలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసింది. 


ఇందులో... 19,600,998 కేసుల్లో రూ.61,252 కోట్లను వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్‌గా జారీ చేశామని; 1,46,871 కేసుల్లో రూ.53,158 కోట్లను కార్పొరేట్ ట్యాక్స్ రీఫండ్‌గా జారీ చేసినట్లు CBDT తెలిపింది. 


2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత & కార్పొరేట్‌ పన్నుల చెల్లింపులు పెరిగినట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలతో (ఏప్రిల్‌ - జులై) పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో కార్పొరేట్ల నుంచి పన్ను వసూళ్లు 34 శాతం పెరిగాయని వెల్లడించింది. "తక్కువ పన్ను రేట్లు, సరళీకృత పన్ను విధానాన్ని" ఇది సూచిస్తోందని తెలిపింది. 


2020-21 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్ - జులై కాలంలో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.7.23 లక్షల కోట్లకు చేరాయని ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది.