Rules Of Joint Income Tax Return: భారతదేశ జనాభా 140 కోట్లకు పైనే. కానీ, నేటికీ మన దేశంలో కేవలం అతి తక్కువ సంఖ్యలోని ప్రజలు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను రిటర్నులు (ITR Filings In 2023-24) దాఖలు చేసిన వారి సంఖ్య 8.09 కోట్లు. వీరిలోనూ దాదాపు 4.5 కోట్ల మంది ప్రజలు పన్ను పరిధిలోకి రాని ఆదాయాన్ని (నిల్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌) ప్రకటించారు. అంటే, 140 కోట్లు దాటిన భారతదేశ జనాభాలో కేవలం 3.19 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లించారు.


ఇటీవల, 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ICAI), తన ప్రి-బడ్జెట్ మెమోరాండమ్‌లో, వివాహిత జంటలు ఉమ్మడి పన్ను పత్రాలు (Joint ITR) దాఖలు చేయడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman)కు ఈ సూచన సమంజమే అనిపించి, దీనిని అమలులోకి తీసుకువస్తే... మన దేశంలో భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకే ఆదాయ పన్ను రిటర్ను దాఖలు చేయడం ద్వారా చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. 


భారతదేశంలో జాయింట్‌ టాక్సేషన్‌ ‍‌(Joint Taxation) రూల్స్‌ ఎలా ఉన్నాయి?
భారతదేశంలో ఉమ్మడి ఆదాయ పన్ను పత్రాల సమర్పణ లేదు. భారతీయ ఆదాయ పన్ను చట్టం (Income Tax Act 1961) ప్రకారం, పౌరుడు ఆదాయ పన్ను చెల్లించాలి. అంటే, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల నియమాలు ‍‌(Individual taxpayer rules) పౌరులకు వర్తిస్తాయి. ఈ నియమం ప్రకారం, ప్రతి పౌరుడు తన ఆదాయాన్ని బట్టి పన్ను చెల్లిస్తాడు, ఆదాయ పన్ను చెల్లింపు అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఆదాయ పన్నును వ్యక్తిగత రాబడి ఆధారంగా మాత్రమే లెక్కిస్తారు. ఈ రూల్స్‌ ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తే ఇద్దరూ వేర్వేరుగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలి తప్ప ఉమ్మడిగా ఒకే ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి వీలు కాదు. అంటే, ప్రస్తుతం, భారత్‌లో ఉమ్మడి ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు. అయితే.. అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో ఉమ్మడి ఆదాయ పన్నుల విధానం ఉంది. దీనివల్ల భార్యాభర్తలు మాత్రమే కాదు, ఆ కుటుంబం మొత్తం చాలా ప్రయోజనం పొందుతుంది.


జాయింట్‌ టాక్సేషన్‌ వల్ల ప్రయోజనం ఏమిటి?
ఉమ్మడి పన్ను విధానంలో, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే ఆదాయ పన్నును ఫైల్ చేస్తారు. ఇందులో, ఏ ఒక్కరి ఆదాయం గురించి ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, వేర్వేరు తగ్గింపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి ఆదాయం మరొకరి కంటే ఎక్కువగా ఉన్న వివాహితులకు ఉమ్మడి పన్ను ప్రయోజనాలు అందుతాయి.


జాయింట్ టాక్సేషన్‌లో, భార్యాభర్తలిద్దరి ఆదాయాన్ని కలపడం ద్వారా అధిక ఆదాయం కలిగిన జీవిత భాగస్వామి పన్ను బాధ్యత తగ్గుతుంది. ఇద్దరి ఆదాయాన్ని కలిపి సగటు ఆదాయాన్ని నిర్ణయిస్తారు. దాని ఆధారంగా ఆదాయ పన్ను రిటర్న్ సిద్ధమవుతుంది. దీని వల్ల, చెల్లించాల్సిన పన్ను భారం తగ్గుతుంది. చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుంది, అవసరమైన చోట ఖర్చు చేయగల లేదా పొదుపులు చేయగల లేదా పెట్టుబడులు పెట్టగల ఆర్థిక స్థోమత పెరుగుతుంది. ప్రజలు ఖర్చు చేసే మొత్తం పెరిగినా, పొదుపులు/పెట్టుబడులు పెరిగినా వాటిపై విధించే వివిధ రకాల పన్నులతో కేంద్రానికి తిరిగి ఆదాయం లభిస్తుంది. ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: 'కొత్త ఆదాయ పన్ను చట్టం' రాబోతోంది! సరికొత్త మార్పులకు సిద్ధంగా ఉండండి