Bitcoin Price Today: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు, క్రిప్టో సామాజ్యానికి కింగ్‌ లాంటి 'బిట్‌కాయిన్' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ రోజు (సోమవారం, 20 జనవరి 2025) ఉదయం, ఒక బిట్‌కాయిన్‌ ధర 109,241 డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదల తర్వాత, బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 1.445 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం, డొనాల్డ్‌ ట్రంప్ క్రిప్టో-స్నేహపూర్వక విధానాలు అవలంబిస్తారన్న అంచనాలతో ఈ రేంజ్‌లో పెరిగింది.

బిట్‌ కాయిన్‌ లావాదేవీలను అధికారికం చేస్తారా?అమెరికా, క్రిప్టో కరెన్సీని అధికారికంగా స్వీకరించలేదు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌ మాత్రం క్రిప్టో అసెట్స్‌పై సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో, క్రిప్టో కరెన్సీ పట్ల పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు. తాను అధ్యక్షుడైన తర్వాత, అమెరికాను క్రిప్టో కరెన్సీకి ప్రపంచ కేంద్రంగా మారుస్తానని కొన్ని సందర్భాల్లో చెప్పారు. ట్రంప్‌ వైఖరిని బట్టి చూస్తే.. అతని పరిపాలనలో, క్రిప్టో కరెన్సీ కంపెనీలపై నిబంధనల భారాన్ని తగ్గించి డిజిటల్ కరెన్సీల స్వీకరణను, ముఖ్యంగా బిట్‌ కాయిన్‌ను ప్రోత్సహించే అవకాశం ఉంది.

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు బిట్‌ కాయిన్‌లో కనిపించిన జంప్‌, ప్రమాణ స్వీకారం తర్వాత కూడా కొనసాగవచ్చని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో బిట్‌కాయిన్ ధర 40 శాతానికి పైగా పెరిగింది. బిట్‌ కాయిన్ పెట్టుబడిదారులు ట్రంప్ పరిపాలన నుంచి సానుకూల మార్పులను ఆశిస్తున్నారని ఈ వృద్ధి సూచిస్తుంది.

పెరిగిన ఇతర క్రిప్టో కరెన్సీలుపెరుగుతున్న బిట్‌ కాయిన్‌ ప్రైస్‌ పెరుగుదల పెట్టుబడిదారులను ఆకర్షించడమే కాకుండా, ఎథేరియం (Ethereum), డోజీకాయిన్‌ (Dogecoin) వంటి ఇతర క్రిప్టో కరెన్సీల వృద్ధికి కూడా దారి తీసింది. Ethereum ధర 6.5 శాతం పెరిగింది, Dogecoin 18 శాతం పెరిగింది. 

మార్కెట్‌లోకి వచ్చిన 'ట్రంప్ మీమ్ కాయిన్'జనవరి 19 ఆదివారం నాడు, డొనాల్డ్ ట్రంప్ తన కొత్త మీమ్‌ కాయిన్ "$TRUMP"ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేశారు. ఇది క్రిప్టో మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ టోకెన్‌ విడుదలైన వెంటనే 300 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది ఇంతకంటే ఎక్కువ పెరిగినప్పటికీ, మెలానియా ట్రంప్ లాంచ్‌ చేసిన "$MELANIA" కాయిన్‌ దెబ్బకు "$TRUMP" కాయిన్‌ ధర తగ్గింది.

బిట్‌ కాయిన్ ఇటీవల అద్భుతాలు చేసి ఉండవచ్చు. కానీ క్రిప్టో మార్కెట్‌ చాలా అస్థిరంగా ఉంటుంది. ట్రంప్‌ తన ఆలోచనలను మార్చుకున్నా లేదా ఏదైనా ప్రతికూల వార్త మార్కెట్లోకి వచ్చినా బిట్‌ కాయిన్ ధర పాతాళానికి పతనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ట్రంప్‌ పేరిట ఒక మీమ్‌ కాయిన్‌ - గంటల వ్యవధిలో 300 శాతం జంప్